సచిన్ టెండూల్కర్... టీమిండియా క్రికెట్లో అతడో మేరుపర్వతమం. తన బ్యాట్ నుండి పరుగుల వరద పారిస్తూ భారత క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. అంతర్జాతీయ స్థాయిలో కేవలం ఒక్క సెంచరీ సాధిస్తే చాలనుకునే రోజుల్లో అతడు ఏకంగా వంద సెంచరీలు బాదిన రికార్డు అతడి సొంతం. ఇలా రికార్డుల మోత మోగించి లెజెండరీ క్రికెటర్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారాడు. 

అయితే ఇలా అభిమానులచేత క్రికెట్ దేవుడిగా పిలిపించుకునే సచిన్ కు సైతం తొలినాళ్లలో అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందట. మేనేజ్‌మెంట్ ను మెరుగైన అవకాశాల కోసం ప్రాధేయపడాల్సి వచ్చిందట. అలా తన కెరీర్ లో చోటుచేసుకున్న ఓ సంఘటనను సచిన్ సరదాగా అభిమానులతో  పంచుకున్నాడు. 

''అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆరంభంలో నేను మిడిల్ ఆర్డర్లో ఆడాల్సివచ్చింది. కానీ నాకుమాత్రం ఓపెనర్ గా ఆడాలని  వుండేది. దాన్నే నేను కంపర్ట్ గా ఫీలయ్యేవాన్ని. దీంతో ప్రతిసారీ మేనేజ్‌మెంట్ ను ఓపెనింగ్ చేయించాల్సిందిగా కోరేవాడిని. ఇలా వారిని పలుమార్లు ప్రాదేయపడగా 1994 లో న్యూజిలాండ్ జట్టుపై ఓపెనింగ్ చేసే అవకాశం లభించింది. ఆక్లాండ్ వేదికన జరిగిన ఈ మ్యాచ్ లో బాగా దూకుడుగా బ్యాటింగ్ చేసి కేవలం 49 బంతుల్లోనే 82 పరుగులు చేశాను. 

ఈ మ్యాచ్ తర్వాత మళ్లీ నాకు ఓపెనింగ్  కోసం ప్రాధేయపడాల్సిన అవసరం రాలేదు.  రెగ్యులర్ ఓపెనర్ గా మారిపోయాను.ఇలా అందివచ్చిన అవకాశాలను నేను ఎప్పుడూ మిస్ చేసుకోలేదు. 

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఎన్ని అవకాశాలిచ్చినా ఇంకో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అలాకాకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మరో అవకాశం కావాలని అడగాల్సిన అవసరం వుండదు కదా. సవాళ్లను స్వీకరించి దైర్యంగా ముందుకెళితేనే క్రికెట్లో ఎక్కువకాలం కొనసాగుతారు. లేదంటే అర్థాంతరంగా కనుమరుగైపోవాల్సి వస్తుంది. '' అంటూ సచిన్ తన అనుభవాలతో కూడిన పాఠాలను యువ క్రికెటర్లకు అందించారు.