TATA IPL 2022: గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్, బ్యాటింగ్ తో  పాటు ఫీల్డింగ్ లో కూడా అద్భుతాలు చేయగల సమర్థుడే. అయితే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో మాత్రం అతడి ఫీల్డింగ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

ఐపీఎల్ -15లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ చేసిన పని ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ముంబై బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో రషీద్ ఫీల్డింగ్ చేస్తుండగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అతడి మిస్ ఫీల్డింగ్ ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది. ప్రదీప్ సాంగ్వన్ వేసిన ఏడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంగ్వాన్ వేసిన ఏడో ఓవర్లో రెండో బంతిని ఇషాన్ కిషన్ కవర్స్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ ఖాన్.. బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. 

మిస్ ఫీల్డ్ అయినా రషీద్ మళ్లీ లేచి బంతిని అందుకుని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు బాల్ ను విసరడానికి యత్నించాడు. ఈ క్రమంలో అతడి చేతిలోంచి బంతి మళ్లీ గతి తప్పింది. అక్కడే వెనక్కి పడింది. మళ్లీ ఒక్క ఉదుటన లేచి బంతిని అందుకున్న రషీద్.. దానిని వికెట్ల వద్ద ఉన్న సంగ్వాన్ వైపునకు విసిరాడు. 

అయితే అది కూడా గురి తప్పింది. సంగ్వాన్ వెనక ఉన్న డేవిడ్ మిల్లర్ కూడా దానిని అందుకోలేకపోయాడు. రనౌట్ మిస్ కాగా తిరిగి మరో ఎక్స్ట్రా పరుగు కూడా ముంబై ఇండియన్స్ కు చేరింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ బంతిని అందుకుని దానిని ఫోర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. 

రషీద్ మిస్ ఫీల్డ్ అనంతరం అతడి దగ్గరికి వచ్చని పాండ్యా.. పడీ పడీ నవ్వాడు. రషీద్ మిస్ ఫీల్డ్, రనౌట్ అవకాశాన్ని కోల్పోవడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ‘రషీద్ భయ్యా ఫీల్డింగ్ చేస్తున్నావా.. చేపలు పడుతున్నావా..?’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. నిన్నటి మ్యాచ్ లో ఆ మిస్ ఫీల్డ్ తప్పితే రషీద్.. మూడు క్యాచులు అందుకున్నాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియల్ సామ్స్ లు ఇచ్చిన క్యాచులు పట్టింది అతడే కావడం గమనార్హం. 

Scroll to load tweet…

ఇక ముంబై తో మ్యాచ్ లో తొలి ఓవర్లో 13 పరుగులిచ్చిన రషీద్ ఖాన్.. తర్వాత మూడు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చాడు. అంతేగాక రెండు కీలక వికెట్లు కూడా తీశాడు. ఈ మ్యాచ్ లో రషీద్.. పొలార్డ్ ను ఔట్ చేసిన బంతైతే మ్యాచ్ కే హైలైట్.

గుజరాత్-ముంబై మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (45), రోహిత్ శర్మ (43), టిమ్ డేవిడ్ (44 నాటౌట్) లు రాణించారు. అనంతరం 178 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్.. 5 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేయగలిగింది. ఆ జట్టుకు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (55), శుభమన్ గిల్ (52) రాణించినా.. ఆ తర్వాత వచ్చినోళ్లు సరిగా ఆడలేకపోయారు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ వంటి హిట్టర్లు ఉన్నా గుజరాత్ ను గెలిపించలేకపోయారు. ఫలితంగా ముంబై.. 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో ముంబైకి ఈ సీజన్ లో రెండో గెలుపు దక్కగా.. గుజరాత్ కు మూడో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.