Gujarat Giants vs Delhi Capitals: 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసిన గుజరాత్ జెయింట్స్... ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 106 పరుగుల టార్గెట్... 

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మారిజానే కాప్ 5 వికెట్లు తీసి, గుజరాత్ జెయింట్స్ టాపార్డర్‌ని కకావికలం చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 105 పరుగుల స్వల్ప స్కోరు చేయగలిగింది.. 

టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ స్నేహ్ రాణా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో బంతికే సబ్బినేని మేఘన వికెట్ కోల్పోయింది గుజరాత్ జెయింట్స్... 2 బంతులాడిన తెలుగమ్మాయి సబ్బినేని మేఘనని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మారిజానే కాప్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాతి ఓవర్‌లో వరుసగా రెండు బంతుల్లో 2 వికెట్లు పడగొట్టింది మారిజానే కాప్... గాయంతో డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌కి దూరమైన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ ప్లేస్‌లో వచ్చిన లౌరా వాల్వర్డ్‌‌ని క్లీన్ బౌల్డ్ చేసింది మారిజానే కాప్...

ఆ తర్వాత అష్‌లీగ్ గార్డ్‌నర్ కూడా మొదటి బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరడంతో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్ జెయింట్స్. దయాళన్ హేమలత, శిఖా పాండే బౌలింగ్‌లో వికెట్ కీపర్ తానియా భాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది...

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును కదిలించే ప్రయత్నం చేసింది హర్లీన్ డియోల్. 14 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన హర్లీన్ డియోల్ కూడా మారిజానే కాప్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరింది. ఆ తర్వాత 10 బంతుల్లో 2 పరుగులు చేసిన సుష్మా వర్మను క్లీన్ బౌల్డ్ చేసిన మారిజానే కాప్... 5 వికెట్లు పూర్తి చేసుకుంది..

33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది గుజరాత్ జెయింట్స్. ఈ దశలో జార్జియా వరెహం, కిమ్ గార్త్ కలిసి ఏడో వికెట్‌కి 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 25 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన జార్జియా వరెహం, రాధా యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది...

తనుజా కాన్వర్ 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసి శిఖా పాండే బౌలింగ్‌లో అవుట్ కాగా, కెప్టెన్ స్నేహ్ రాణా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 3 బంతుల్లో 2 పరుగులు చేసిన స్నేహ్ రాణా, శిఖా పాండే బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, ఆమెకే క్యాచ్ ఇచ్చి అవుటైంది...

కిమ్ గార్త్ 37 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేయగా మన్షీ జోషి 5 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మారిజానే కాప్ 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా శిఖా పాండేకి 3 వికెట్లు దక్కాయి. రాధా యాదవ్ ఓ వికెట్ తీసింది.