Indian Cricketers in Foreign Leagues:విదేశీ క్రికెటర్లు వచ్చి ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడు మన ఆటగాళ్లు ఫారెన్ లీగ్‌లలో ఎందుకు ఆడటం లేదని ప్రతి భారత అభిమాని ఏదో ఒక సందర్భంలో బాధపడే ఉంటాడు. కానీ వారి బాధలకు త్వరలోనే శుభం కార్డు పడనుంది.
విరాట్ కోహ్లీ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో ఆడితే..? రోహిత్ శర్మ యూఏఈ క్రికెట్ లీగ్ లో మెరుపులు మెరిపిస్తే..? ఇషాన్ కిషన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో ధనాధన్ షాట్లు కొడితే..? సూర్యకుమార్ యాదవ్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో రఫ్ఫాడిస్తే..? ఆ మజానే వేరు కదా. విదేశీ క్రికెటర్లు వచ్చి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మెరుస్తున్నప్పుడు మన ఆటగాళ్లు విదేశీ లీగ్‌లు ఎందుకు ఆడటం లేదని ప్రతి అభిమాని ఏదో ఒక సందర్భంలో బాధపడే ఉంటాడు. కానీ వారి బాధలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) త్వరలో చెక్ పెట్టనుంది.
భారత క్రికెటర్లు విదేశీ లీగ్ లో ఆడొద్దని ఇన్నాళ్లు గిరిగీసుకుని కూర్చున్న బీసీసీఐ ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తున్నది. ఇకనుంచి వారిని విదేశీ క్రికెట్ లీగ్ లలో ఆడించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు బీసీసీఐ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రస్తుతం వారికే.. కానీ..
బీసీసీఐ నిబంధనల ప్రకారం జాతీయ జట్టుతో గానీ రంజీలో ఆడుతున్న ఏ క్రికెటర్ గానీ విదేశీ లీగ్ లు ఆడటానికి ఆస్కారం లేదు. కానీ ఆట నుంచి రిటైరైన వాళ్లు, ఇక ఇండియా తరఫున ఆడబోమని భావించినవాళ్లతో పాటు మహిళా క్రికెటర్లకు మాత్రం ఫారెన్ లీగ్ లలో ఆడే అవకాశమిస్తున్నది బీసీసీఐ. కానీ తాజాగా బీసీసీఐ తన తీరును మార్చుకున్నట్టు తెలుస్తున్నది. ఐపీఎల్ విశ్వవ్యాప్తమైన నేపథ్యంలో భారత ఆటగాళ్లను స్వదేశానికే పరిమితం చేయకుండా పారెన్ లీగ్ లలో కూడా ఆడించాలని భావిస్తున్నట్టు ఇన్‌సైడ్‌స్పోర్ట్స్ కథనం పేర్కొంది.
సెప్టెంబర్ లో నిర్ణయం..
ఈ విషయమై బీసీసీఐ అన్యూవల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం) లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ భేటీలో భారత ఆటగాళ్లను విదేశీ లీగ్ లలో ఆడించడమా..? లేదా..? అనేదానిపై బీసీసీఐ తుది నిర్ణయానికి రానున్నట్టు సమాచారం.
ఒత్తిడి చేస్తున్న ఫ్రాంచైజీలు..
ఐపీఎల్ రేంజ్ పెరగడంతో ఇక్కడి ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికాలో కూడా జెండా పాతాయి. అక్కడ ఆరు ఫ్రాంచైజీలతో వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కాబోతున్న సౌతాఫ్రికా క్రికెట్ టీ20 లీగ్ లో ఆరింటికి ఆరు జట్లను దక్కించుకున్నవి మన ఫ్రాంచైజీలే. దీంతో భారత ఆటగాళ్లపై ఉన్న ఈ ‘బంధనాలను’ తెంచేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బోర్డుపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫ్రాంచైజీల ఒత్తిడికి తలొగ్గితే ఇకనుంచి భారత ఆటగాళ్లు ఫారెన్ లీగ్ లలో మెరుపులు మెరిపించనున్నారు.
బీసీసీఐ భయమదే..
ఫ్రాంచైజీల ఒత్తిడికి తలొగ్గితే ఐపీఎల్ ప్రత్యేకత కోల్పోతుందని బీసీసీఐ భయపడుతోంది. ఐపీఎల్ సక్సెస్ కు ఒకానొక కారణం ఇక్కడి ప్లేయర్లను విదేశీ లీగ్ లలో ఆడించకపోవడమే అని బీసీసీఐ భావిస్తోంది. అదీగాక వారిని ఇతర లీగ్ లలో ఆడిస్తే ఐపీఎల్ ప్రత్యేకత కోల్పోతుందని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కానీ ఈ విషయంలో ఫ్రాంచైజీలు బీసీసీఐని ఒప్పించే యత్నం చేస్తున్నట్టు సమాచారం.
వారికి మినహాయింపు..?
ఐపీఎల్ ఫ్రాంచైజీల ఒత్తిడికి తలొగ్గి భారత ఆటగాళ్లను విదేశీ లీగ్ లు ఆడించేందుకు సిద్ధపడ్డా బీసీసీఐ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేసే అవకాశమున్నట్టు సమాచారం. కీలక ఆటగాళ్లుగా భావించే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రాహుల్ వంటి వారిని దీనినుంచి మినహాయించి మిగిలిన వారిని ఆడించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని తెలుస్తున్నది. దీనిపై పూర్తి వివరాలు మరో రెండు నెలలలో తెలియనున్నాయి.
