BCCI - Bio Bubble: మాయదారి మహమ్మారి కరోనా పుణ్యమా అని క్రికెటర్లు బయో బబుల్ జీవితాలను గడుపుతున్నారు. ఒక్కసారి బబుల్ లోకి ఎంటర్ అయితే అది వారికి ఒక పద్మవ్యూహంగా మారిపోయింది. అయితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వారికి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నది.
భారత క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పనున్నది. ‘బుడగ’లో పడి చిత్తవుతున్న వారి జీవితాలకు కాస్త ప్రశాంతత కల్పించేందుకు సిద్ధమవుతున్నది. కరోనా కాలం నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన ‘బయో బబుల్’ కు ఇక స్వస్థి చెప్పాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బబుల్ వల్ల ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్న నేపత్యంలో బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ ఏప్రిల్ నుంచే బబుల్ లేని వాతావరణాన్ని (మునపటి) కల్పించేందుకు సిద్ధమైంది. అయితే ఇది అంతర్జాతీయ స్థాయిలో ఆడే క్రికెటర్లకు కాదు. దేశవాళీలో ఆడే ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది.
దేశవాళీ ట్రోఫీలు, రంజీలు ఆడే ఆటగాళ్లు కూడా అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ల మాదిరి బయో బబుల్ లో ఉండాల్సిందే. కరోనా ప్రారంభమయ్యాక క్రికెటర్లంతా బబుల్ లోనే ఆడాల్సి వస్తున్నది. అయితే ఇక నుంచి దేశవాళీ క్రికెటర్లకు ఈ కఠినమైన జీవితాల నుంచి కాస్త తెరిపినివ్వాలని బీసీసీఐ భావించింది. ఈ మేరకు త్వరలో జరుగబోయే రెండు దేశవాళీ టోర్నీలను బబుల్ లేకుండానే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈనెల 18 నుంచి అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీతో పాటు సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ రెండు సిరీస్ లలో ప్రయోగాత్మకంగా దీనిని ప్రవేశపెట్టనున్నారు. అక్కడ విజయవంతమైతే ఇక దీనికి పూర్తిస్థాయిలో అమలు చేసేందకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఆ రెండు టోర్నీల నుంచే...
ఏప్రిల్ 18న మొదలయ్యే ఈ టోర్నీలకు ఆటగాళ్లు మూడు రోజులు (ఏప్రిల్ 15) వరకు చేరుకుంటే సరిపోతుందని, వాళ్లు బబుల్ లో గడపాల్సిన పని గానీ, కఠినమైన క్వారంటైన్లు గానీ ఉండబోవని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 15కు వేదికల వద్దకు చేరుకునే ఆటగాళ్లు.. ఏప్రిల్ 16 నుంచి ప్రాక్టీస్ మొదలుపెడతారని ఆయన చెప్పారు.
ఇవి మాత్రం తప్పనసరి..
బబుల్ నిబంధలను ఉపసంహరించుకోనున్న బీసీసీఐ.. ఆటగాళ్లు మాత్రం తప్పకుండా ప్రతిరోజు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ‘ఐపీఎల్ షెడ్యూల్ ప్రారంభమైనప్పుడు దేశంలో థర్డ్ వేవ్ నెమ్మదిగా కనుమరుగవుతున్నది. ఇప్పుడు దేశంలో కరోనా భయం కూడా లేదు. అయితే ఇంత మాత్రానా ఇప్పటికిప్పుడు ఐపీఎల్ ను వివిధ నగరాలకు విస్తరించే ఆలోచనైతే లేదు. కానీ వచ్చే రెండు దేశవాళీ టోర్నీలలో మాత్రం బబుల్ లేకుండానే వాటిని నిర్వహించాలని భావిస్తున్నాం. ఈ రెండు టోర్నీలలో ఫలితాలను చూసి దేశవాళీ క్రికెట్ ను బబుల్ లో నిర్వహించాలా...? వద్దా..? అనేదానిపై నిర్ణయానికి రానున్నాం. దానిని బట్టి ఐపీఎల్ లో కూడా నిబంధనలను సడలించాలనేదానిపై దృష్ది సారిస్తాం..’ అని తెలిపారు.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో గతంలో మాదిరే క్రికెట్ టోర్నీలను నిర్వహించే పరిస్థితులపై దృష్టిసారించాలని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే కీలక అడుగు వేస్తున్న బీసీసీఐ కూడా.. నిబంధనలను సవరించినా ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండాలని, కరోనా మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. హోటళ్లలో ఉండే ఆటగాళ్లు.. తమ ప్రత్యర్థి జట్ల క్రికెటర్లను కలవకుంటేనే మంచిదని తెలిపింది.
