INDvsAUS: భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఈనెల  9 నుంచి  అహ్మదాబాద్ వేదికగా మొదలుకాబోయే  నాలుగో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ టెస్టుకు ఇండియా-ఆస్ట్రేలియా ప్రధానులు  రానున్నారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈనెల 9 నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే నాలుగో టెస్టుకు ముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ టెస్టు చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ లు.. అహ్మాదాబాద్ కు రానున్న నేపథ్యంలో తొలి రోజు ప్రేక్షకులను అనుమతించడం లేదని వస్తున్న వార్తలపై జీసీఏ స్పందించింది. అవన్నీ రూమర్లేనని.. ప్రేక్షకులు లేకుండా టెస్టు మ్యాచ్ ను నిర్వహించి ఏం ఉపయోగమని తెలిపింది. 

ఇదే విషయమై జీసీఏ సెక్రటరీ అనిల్ పాటిల్ మాట్లాడుతూ.. ‘అవన్నీ రూమర్లు. నాలుగో టెస్టు తొలి రోజు ఆట కోసం టికెట్లు ఇంకా బుక్ మై షో యాప్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ఎంపిక చేసిన సీట్లలో మాత్రం ప్రేక్షకులకు అనుమతి లేదు. మిగిలిన సీట్లు వారు యాప్ లో బుక్ చేసుకోవచ్చు...’అని తెలిపాడు. 

మూడు రోజుల క్రితం నాలుగో టెస్టు తొలి రోజు టికెట్లను జీసీఏ బ్లాక్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇరు దేశాల ప్రధానులు వస్తుండటం వల్ల ప్రేక్షకులను అనుమతిస్తే దానివల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జీసీఏ తొలి రోజుకు టికెట్ల విక్రయాన్ని నిలిపేసిందని వార్తలు వెలువడ్డాయి. అయితే అప్పుడు కూడా ప్రధానులు ఉన్నంతవరకే గేట్లను మూసేస్తారని, వాళ్లు వెళ్లిపోయాక మళ్లీ ప్రేక్షకులను అనుమతిస్తారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేశారు. తాజాగా జీసీఏ సెక్రటరీ వాటన్నింటినీ పుకార్లే అని కొట్టిపడేయడంతో ప్రేక్షకులు ఊపరి పీల్చుకున్నారు.

Scroll to load tweet…

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా ప్రధానులతో పాటు తమ అభిమాన క్రికెటర్ల ఆటను వీక్షించడానికి చాలామంది స్టేడియానికి పోటెత్తుతారని జీసీఏ ఆశిస్తున్నది. అదీగాక నాలుగు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇదివరకే భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్నా ఈ టెస్టు గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో ఈ టెస్టు రసవత్తరంగా ఉండనుంది. దీనిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు వేచి చూస్తున్నారు. ఇండోర్ లో పూర్తి స్పిన్ పిచ్ ను తయారుచేసి పరువు పోగొట్టుకున్న బీసీసీఐ.. ఈ పిచ్ ను ఎలా తయారుచేస్తుందనేది..? ఆసక్తికరంగా మారింది. 

కాగా ఢిల్లీ టెస్టు తర్వత వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆ జట్టు సారథి పాట్ కమిన్స్.. నాలుగో టెస్టుకు కూడా అందుబాటులో ఉండటం లేదు. నాలుగో టెస్టుతో పాటు వన్డే సిరీస్ కు కూడా అతడు ఇండియా వచ్చేది అనుమానంగానే ఉంది. దీంతో అహ్మదాబాద్ టెస్టులో కూడా ఆసీస్ ను స్టీవ్ స్మిత్ నడిపించనున్నాడు.