కెనడా గడ్డపై వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ విధ్వంసం కొనసాగింది. బ్రాంఫ్టన్ వేదికన వాంకోవర్ నైట్స్, మోన్‌ట్రెల్స్ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గేల్ సెంచరీతో కదంతొక్కాడు. అతడు కేవలం 54 బంతుల్లోనే 12 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 122 పరుగులు బాది నాటౌట్ గా నిలిచాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన వాంకోవర్ నైట్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 276 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అయితే వాంకోవర్స్ జట్టును దురదృష్టం వెంటాడింది. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచినా సెకండ్ ఇన్నింగ్స్ కు వాతావరణం అనుకూలించక పోవడంతో ఈ మ్యాచ్ రద్దయింది. దీంతో గేల్ సూపర్ సెంచరీతో పాటు మిగతా బ్యాట్స్ మెన్స్ శ్రమ వృదా అయ్యింది. 

అయితే అభిమానులకు మాత్రం గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ రూపంలో మంచి మజా దక్కింది. తన సెంచరీని సైతం సిక్సర్ తోనే  పూర్తిచేసుకున్నాడంటే గేల్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా ఆటగాళ్లలో విసీ 19 బంతుల్లో 51, వాండర్ డుస్సెన్ 25 బంతుల్లో 56 పరుగులతో విజృంభించడంతో వాంకోవర్స్ 276 పరుగుల భారీ స్కోరును సాధించగలిగింది. 

వాంకోవర్స్ బ్యాట్స్ మెన్స్ ను అడ్డుకోవడంలో మోన్ట్రీల్స్ టైగర్స్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అత్యధికంగా అబ్బోట్ 4 ఓవర్లలోనే 68 పరుగులు సమర్పించుకున్నాడు.  ఇక విండీస్ బౌలర్ నరైన్ కూడా 4 ఓవర్లలో 50 పరుగులను సమర్పించుకున్నాడు.