కపిల్ దేవ్ 175 పరుగుల ఇన్నింగ్స్ కంటే మ్యాక్స్ వెల్ వీరోచిత డబుల్ సెంచరీ గొప్పదా? నెట్టింట మరో రచ్చ..
Glenn Maxwell: ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ అద్భుత విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలివుండగానే సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది. టాప్ ఆర్డర్ కుప్పకూలి పీకల్లోతు కష్టాల్లో ఉన్న తరుణంలో గ్రౌండ్ లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ వీరోచిత డబుల్ సెంచరీ ఇన్నిగ్స్ తో ఆసీస్ కు విజయాన్ని అందించాడు.
ICC Cricket World Cup: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వీరోచిత డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి మెగా టోర్నీలో సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప ఇన్నింగ్స్ అని చెప్పడంలో సందేహం లేదు. అయితే, ఇలాంటి వీరోచిత ఇన్నింగ్స్ ల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏదీ అన్నింటికంటే గొప్ప ఇన్నింగ్స్ అని ఒకదానికొకటి పోలుస్తుంటారు. ఇదే క్రమంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్తాన్ పై గ్లెన్ మ్యాక్స్ వెల్ సాధించిన 201 నాటౌట్ ఇన్నింగ్స్ ను 1983 ప్రపంచకప్ లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగులతో పోలుస్తూ మంగళవారం వాడివేడి వాదన తెరపైకి వచ్చింది. ఈ రెండు ఇన్నింగ్స్ లు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఔత్సాహికులు, నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు సైతం వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కపిల్ దేవ్ 175 పరుగుల లెజెండరీ ఇన్నింగ్స్..
1983 ప్రపంచకప్ లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగులు క్రికెట్ చరిత్ర గమనాన్ని నిర్దేశించిన ఐకానిక్ ఇన్నింగ్స్ గా నిలిచిపోయాయి. భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన పరిస్థితిని ఎదుర్కొన్న ఈ మ్యాచ్ లో కపిల్ దేవ్ క్రీజులోకి వచ్చి చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్ ను ఆడాడు. ఓటమి నుంచి తప్పించి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ అద్బుతమైన విజయం అందించాడు. ఇక ఫైనల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న వెస్టిండీస్ ను ఓడించి కపిల్ దేవ్ అండ్ కో ప్రపంచ కప్ ను గెలుచుకుంది.
మ్యాక్స్ వెల్, కపిల్ దేవ్ ఇన్నింగ్స్ లను పోలుస్తూ..
మ్యాక్స్ వెల్, కపిల్ దేవ్ ఇన్నింగ్స్ లను క్రికెట్ ప్రియులు, క్రీడా విశ్లేషకులు, నెటిజన్లు పోలుస్తూ భిన్న కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. వీరి రెండు ఇన్నింగ్స్ కూడా ప్రపంచ కప్ లో చోటుచేసుకున్నాయి. అలాగే, టోర్నిలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లు. దీనికి తోడూ పీకల్లోకూ కష్టాల్లో ఉన్న సమయంలో ఒంటరి పోరాటం చేసి.. తమ జట్లకు విజయాన్ని అందించారు. ఇద్దరూ ఒత్తిడిని అధిగమించి, వ్యక్తిగత ప్రతిభను, ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఇది అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాదు, క్రికెట్ చరిత్రలో ఒక పరివర్తనాత్మక క్షణంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో వీరిఇద్దరి చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ గురించి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.