ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్, భారత క్రికెట్ జట్టులు అక్టోబర్ 24న ఒమన్‌లో తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం బీసీసీఐ ఇది వరకే టీమిండియా జట్టును ప్రకటించింది. తాజాగా, గౌతమ్ గంభీర్ పాక్‌తో తలపడనున్న తన జట్టు ఇదేనని తెలిపారు. ఇందులో ఓ స్టార్ క్రికెటర్‌కు చోటునివ్వలేదు. 

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులందరూ త్వరలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ టోర్నీలోని ఫేవరైట్ మ్యాచ్‌ల లిస్టును తయారుచేసుకుంటున్నారు. అందులో పాకిస్తాన్‌తో భారత్ తలపడే మ్యాచ్‌లు నిస్సందేహంగా అగ్రస్థానంలో ఉంటాయి. అంతేకాదు, ఇంకొందరు వీరాభిమానులు పాకిస్తాన్‌తో ఆడే జట్టు ఇలా ఉండాలనీ భావిస్తుంటారు. ఓపెనర్లు, బ్యాట్స్‌మెన్, బౌలర్ల జాబితా ఎవరికివారుగా రూపొందించుకుంటుంటారు. ఇటీవలే ఐసీసీ టీ20 కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, గౌతమ్ గంభీర్ తన టీమ్‌ను ప్రకటించుకున్నారు. పాకిస్తాన్‌తో తలపడే తన జట్టు ఇదేనంటూ తెలిపారు. అయితే, గౌతమ్ గంభీర్ ప్రకటించుకున్న టీమ్‌లో కీలక ఆటగాడికి చోటివ్వకపోవడం గమనార్హం.

పాకిస్తాన్‌తో తలపడే టీమిండియా జట్టుకు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఉండాలని, విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో, సూర్యకుమార్ నాలుగో స్థానంలో క్రీజులోకి రావాలని భావించారు. ఆ తర్వాత రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, భువీ, వరుణ్ చక్రవర్తి, షమీల పేర్లు.. పదకొండో స్థానంలో బుమ్రా ఉండాలని పేర్కొన్నారు. అయితే, ఆయన జట్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటివ్వలేదు.

యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాక్ క్రికెట్ టీమ్‌లు తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం బీసీసీఐ ఇది వరకే టీమిండియా జట్టును ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలున్నారు. వీరితోపాటు స్టాండ్ బై ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లున్నారు.