గౌతమ్ గంభీర్... భారత క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే  అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన గంభీర్ ఆ తర్వాత వెంటనే రాజకీయ రంగప్రవేశం చేశాడు. తూర్పు డిల్లీ నుండి బిజెపి తరపున లోక్ సభ కు పోటీ చేసిన అతడు ఆరంగేట్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇలా అతడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారినా క్రికెట్ బాషను వదల్లేక పోతున్నట్లున్నాడు. గెలుపు సంబరాల్లో మునిగిపోయిన అతడు క్రికెట్ స్లైల్లోనే తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 

''ఇది (తన విజయం) లవ్లీ కవర్ డ్రైవో లేక అద్భుతమైన బ్యాటింగో  కాదు. ఇది కేవలం బిజెపి ''గంభీర్'' ఐడియాలజీకి డిల్లీ ప్రజలు అందించిన సపోర్ట్ మాత్రమే. తన విజయానికి కారణమైన భారత, డిల్లీ బిజెపి జట్టు సభ్యులకు కృతజ్ఞతలు. ప్రజల ఆశలను నెరవేర్చడంలో తాము విఫలమవ్వబోము. మరో సారి మోదీ సర్కార్ ఏర్పాటవడానికి సహకరించిన అందరికీ  ధన్యవాదాలు'' అంటూ గంభీర్ తనదైన క్రికెట్ బాషలో ట్వీట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. 

తూర్పు డిల్లీ నుండి బిజెపి అభ్యర్థిగా బరిలోకి  దిగిన గంభీర్ కు మొత్తం 6,95,109 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీకి 3,04,718 ఓట్లు, ఆప్ అభ్యర్థి ఆతిశీ మెర్లీన్‌ 2,19,156 ఓట్లు లభించాయి. ఇలా మొత్తం పోలైన ఓట్లలో 55.35 శాతం ఓట్లు సాధించిన గంభీర్ భారీ విజయాన్ని అందుకున్నాడు. క్రికెట్లో అద్భుతంగా రాణించిన గంభీర్ ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.