IPL 2022 Eliminator: లక్నో-బెంగళూరు మధ్య బుధవారం రాత్రి ముగిసిన పోరులో 14 పరుగుల తేడాతో కెఎల్ రాహుల్ సేన ఓడింది. దీంతో ఆ జట్టు ఇంటిబాట పట్టింది.
ఐపీఎల్-15 లో భాగంగా బుధవారం రాత్రి లక్నో-బెంగళూరు నడుమ ముగిసిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి 14 పరుగుల తేడాతో లక్నోను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓటమి అనంతరం కెఎల్ రాహుల్.. జట్టు మెంటార్ గౌతం గంభీర్ ల ఒక ఫోటో వైరల్ గా మారింది. రాహుల్ ను తదేకంగా చూస్తున్న గంభీర్ ఫోటో పై సోషల్ మీడియాలో మీమర్స్ పండుగ చేసుకుంటున్నారు.
మ్యాచ్ ముగిశాక గంభీర్.. రాహుల్ ను తదేకంగా చూస్తుండగా.. రాహుల్ మాత్రం ‘ఈయనేంటి కొట్టేవాడిలా చూస్తున్నాడు..’ అన్నట్టుగా మరోవైపు ముఖం పెట్టుకున్నాడు. ఈ ఫోటో పై సోషల్ మీడియా లో వచ్చిన మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
పలువురు నెటిజన్లు ఈ ఫోటోపై స్పందిస్తూ.. ‘చూడు గౌతం గంభీర్.. నీ పని నువ్వు చూసుకో. అతడి (రాహుల్) కు దూరంగా ఉండు. రాహుల్ ను ఒంటిరిగా వదిలేయ్. అతడికి బహుమతులిచ్చి సత్కరించు.. అతడు భవిష్యత్ లెజెండ్..’ అని ఓ యూజర్ రాశాడు. సాగర్ అనే ఓ యూజర్.. ‘ఇంకెంత డీప్ గా మ్యాచ్ ఆడతావ్..? నీకు 22 ఓవర్లు కావాలా..?’ అని పేర్కొన్నాడు.
అఖిల్ అనే మరో యూజర్ ఈ ఫోటోను ట్వీట్ చేస్తూ.. ‘ఎల్ఎస్జీ ఓడినందుకు కాదు.. విరాట్ కోహ్లి గెలిచినందుకు నేనెక్కువగా బాధపడుతున్నా..’ అని పేర్కొన్నాడు. నిఖిల్ అనే యూజర్.. ‘భాయ్ ఈ (కెప్టెన్) నువ్ ఉద్యోగం మానేయి. నీవల్ల పైసా ఉపయోగం లేదు..’ అని ట్వీట్ చేశాడు. ఈ మీమ్స్ అన్ని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
కాగా తమ ఓటమిపై గౌతం గంభీర్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘ఇవాళ మాకు అదృష్టం కలిసిరాలేదు. మాది కొత్త జట్టు అయినా గొప్పగా పోరాడాం. మేము వచ్చే సీజన్ లో ఇంతకన్నా స్ట్రాంగ్ గా వస్తాం...’ అని పోస్ట్ చేశాడు.
