స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీలు కొడితే ఆస్ట్రేలియా కమ్‌బ్యాక్ ఇవ్వొచ్చన్న గౌతమ్ గంభీర్.. 4 మ్యాచులు కాదు కదా, 10 మ్యాచులు ఉన్నా 10-0 తేడాతో సిరీస్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన హర్భజన్ సింగ్.. 

ఐసీసీ నెం.1 టెస్టు టీమ్‌ హోదాలో భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా, మొదటి రెండు టెస్టుల్లో ఆ రేంజ్ పర్ఫామెన్స్ అయితే చూపించలేకపోయింది. నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడిన ఆసీస్, ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది...

రెండో రోజు ఆట ముగిసే సమయానికి చేతిలో 9 వికెట్లతో టీమిండియాపై 62 పరుగుల ఆధిక్యంతో ఉన్న ఆస్ట్రేలియా... మూడో రోజు తొలి సెషన్‌లో పూర్తిగా చేతులు ఎత్తేసింది. 52 పరుగుల తేడాతో 9 వికెట్లు కోల్పోయి 113 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ 3 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా ఏకంగా 7 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు..

‘ఆస్ట్రేలియాకి డిఫెన్స్ ఎలా ఆడాలో నేర్పించాల్సిన అవసరం లేదు. ఆ టీమ్‌లో ఉన్నవాళ్లు కొత్త ప్లేయర్లేమీ కాదు. అయితే ఇప్పటికే సిరీస్ సగం ముగిసింది. సిరీస్ మధ్యలో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవాలని చూస్తే ఈ మాత్రం స్కోర్లు కూడా చేయలేరు...

ఢిల్లీ టెస్టులో 260 పరుగులైనా చేసింది ఆస్ట్రేలియా, కొత్తగా ట్రై చేయాలనుకుంటే అది కూడా చేయలేరు. ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాటర్లు వ్యక్తిగత ప్రదర్శనలపైన ఫోకస్ పెట్టాలి. సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేసుకోవడం మీద దృష్టి పెడితే అది టీమ్‌కి ఉపయోగపడొచ్చు..

ఇప్పుడు ఆస్ట్రేలియా టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో చాలామంది తమ స్కిల్స్‌పై నమ్మకం కోల్పోయారు. స్పిన్ పిచ్‌లపై ఆడలేమనే దృఢ నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటి పొజిషన్‌లో ఉస్మాన్ ఖవాజా ఓ డబుల్ సెంచరీ కొడితే, లేదా స్టీవ్ స్మిత్ ఓ సెంచరీ బాదితే... తిరిగి మిగిలిన ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం పెరగొచ్చు...

అయితే ఆస్ట్రేలియా కమ్‌బ్యాక్ ఇస్తుందనే నమ్మకం మాత్రం నాకు కలగడం లేదు. నాకు తెలిసి టీమిండియా 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుంది. అయితే ఆస్ట్రేలియాలో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా వంటి సత్తా ఉన్న బ్యాటర్లు పుష్కలంగా ఉన్నారు...

వారిలో ఒకరు డబుల్ సెంచరీ బాదినా, ఆస్ట్రేలియా టీమ్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ఇంతకుముందు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ చేసిన భాగస్వామ్యం గుర్తింది కదా. ఫాలో ఆన్ ఆడుతున్న టీమిండియా, అన్యూహ్యాంగా ఈ ఇద్దరి భాగస్వామ్యం కారణంగా కమ్‌బ్యాక్ ఇచ్చి.. సిరీస్ గెలిచింది.. 

అలాంటి మ్యాజిక్ చేసే సత్తా ఆస్ట్రేలియాకి ఉంది. టెక్నికల్‌గా ఆస్ట్రేలియాని ఎక్కడా తక్కువ అంచనా వేయడానికి లేదు. అయితే వాళ్లు ఇప్పుడు అనేక సమస్యలతో బాధపడుతున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా గౌతమ్ గంభీర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు తెలిపాడు. ‘మొదటి రెండు మ్యాచుల్లో పర్ఫామెన్స్ తర్వాత టీమిండియాపై నాకు డబుల్ నమ్మకం పెరిగింది. భారత జట్టు సిరీస్‌ని 4-0 తేడాతో గెలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచులు మాత్రమే కాదు, ఒకవేళ 10 మ్యాచుల సిరీస్ పెడితే అప్పుడు కూడా 10-0 తేడాతో ఆసీస్‌ని ఓడించే సత్తా భారత జట్టుకి ఉంది...’ అంటూ వ్యాఖ్యానించాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..