భారత్ ఓటమిపై మొసలి కన్నీరు కారుస్తున్న పాక్ మాజీలు.. నెటిజన్ల ఆగ్రహం

T20 World Cup 2022: ఇంగ్లాండ్ తో సెమీస్ లో భారత్ ఓటమిపాలయ్యాక పాకిస్తాన్ మాజీలు షోయభ్ అక్తర్, వసీం అక్రమ్,   సయీద్ అజ్మల్,  షాహిద్ అఫ్రిది,  ఇమ్రాన్ నజీర్ లు  ట్విటర్ వేదికగా స్పందించారు. 

From Wasim Akram to Shoaib Akhtar, This is how Pakistan Cricketers Reacts After India Loss in T20 World Cup 2022

పొట్టి ప్రపంచకప్ లో భారత్ ప్రయాణం సెమీస్ లోనే ముగిసింది.  గురువారం ఇండియా-ఇంగ్లాండ్ మధ్య  అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన  రెండో సెమీస్ లో భారత జట్టు అవమానకర రీతిలో ఓడింది. దీంతో స్వదేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా మాజీ క్రికెటర్లు టీమిండియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  తాజాగా భారత జట్టు ఓటమిపై  పాకిస్తాన్ మాజీలు సోషల్ మీడియా ఖాతాలలో మొసలి కన్నీరు కారుస్తున్నారు. 

ఇంగ్లాండ్ తో సెమీస్ లో భారత్ ఓటమిపాలయ్యాక పాకిస్తాన్ మాజీలు షోయభ్ అక్తర్, వసీం అక్రమ్,   సయీద్ అజ్మల్,  షాహిద్ అఫ్రిది,  ఇమ్రాన్ నజీర్ లు  ట్విటర్ వేదికగా స్పందించారు. 

అక్తర్ స్పందిస్తూ.. ‘ప్చ్.. మీరు మెల్‌బోర్న్ కు వస్తారనుకున్నాం. కానీ మీకు అర్హత లేదు.  మీ ఆట చాలా నిరాశపర్చింది.  వాళ్ల క్రికెట్ ఎలా ఉందో ఇవాళ అర్థమైంది. బౌలింగ్ లో ఇండియా దారుణంగా విఫలమైంది. చాహల్ ను ఎందుకు ఆడించలేదో నాకు తెలియదు.  ఇండియాకు ఇది బ్యాడ్ డే..’అని వీడియోను విడుదల చేశాడు.  

పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ స్పందిస్తూ.. ‘కంగ్రాట్యూలేషన్స్ ఇంగ్లాండ్. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అదరగొట్టారు.  అదిల్ బౌలింగ్ ప్రదర్శన బాగుంది.  ఇండియాకు  ఈరోజు లక్ లేదు. హార్ధిక్ - విరాట్ కీలక ఇన్నింగ్స్ ఆడినా  దురదృష్టవశాత్తూ వాళ్లు ఫైనల్ కు వెళ్లలేదు..’ అని రాసుకొచ్చాడు.  ఇమ్రాన్ నజీర్.. అక్షయ్ కుమార్  బాలీవుడ్ మీమ్ ఒకటి షేర్ చేస్తూ.. ‘ప్చ్, ఇండియా-పాకిస్తాన్ ఫైనల్ చూడాలనుకున్నాం.  కానీ ఏం చేస్తాం..’ అని వసీం జాఫర్ ను ట్రోల్ చేస్తూ  ట్వీట్ చేశాడు. 

షాహిద్ అఫ్రిది స్పందిస్తూ.. ‘ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. అసలు ఈ మ్యాచ్ చూస్తుంటే ఇది సెమీఫైనలేనా..? అన్నట్టుగా ఉంది.  భారత్ ఈ మ్యాచ్ లో పోటీలోనే లేదు.  అలెక్స్ హేల్స్ - జోస్ బట్లర్ బ్యాటింగ్ కు టీమిండియా బౌలర్ల దగ్గర సమాధానం లేదు. మెల్‌బోర్న్ లో ఇంగ్లాండ్ - పాకిస్తాన్ మ్యాచ్ లో కలుద్దాం..’ అని ట్వీట్ చేశాడు. 

 

ఇక పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ స్పందిస్తూ.. ‘ఐపీఎల్ భారత్ కు ప్రయోజనం చేకూరుస్తుందని   అందరూ అన్నారు. 2008లో ఐపీఎల్ వచ్చింది. అప్పట్నుంచి భారత్ టీ20 ప్రపంచకప్ నెగ్గిందే లేదు.  ఈ లీగ్ వల్ల ఏం లాభం చేకూరుతుంది మరి..? భారత ఆటగాళ్లను విదేశీ లీగ్స్ లో అనుమతిస్తే అయినా భారత్ ఆడే విధానం మారుతుందేమో..’ అని తెలిపాడు. 

 

కాగా పాక్ మాజీల మొసలికన్నీరుపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  భారత్ సెమీస్ కు నేరుగా చేరుకున్నదని.. ఇతర జట్ల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడలేదని  పాక్ కు చురకలంటిస్తున్నారు.  అదృష్టం కొద్దీ సెమీస్ చేరిన మీకే అంతుంటే కష్టపడి ఈ దశ వరకు వచ్చిన మాకెంత ఉండాలని  చురకలంటిస్తున్నారు. మరీ అంత ఎగిరిపడాల్సిన అవసరం లేదని.. నవంబర్ 13న మీక్కూడా షాకులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios