Asia Cup 2022: టీమిండియా సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లు ఇప్పటికీ ప్రతీ మ్యాచ్ లో ప్లేయర్లను మారుస్తూనే ఉన్నారు. మరో నెలన్నర రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుండగా ఇప్పటికీ మనకు... !!
ఆసియా కప్ లో టీమిండియా వైఫల్యానికి గల కారణాలేంటని ఎవ్వరినడిగినా బ్యాటింగో, బౌలింగో, ఫీల్డింగో అని చెప్పడం లేదు. సామాన్య క్రికెట్ అభిమాని నుంచి మ్యాచులను విశ్లేషించే మాజీ క్రికెటర్లు, క్రికెట్ పండితుల వరకూ అందరిదీ ఒకటే మాట.. అదే జట్టు సెలక్షన్. టీమిండియా సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లు ఇప్పటికీ ప్రతీ మ్యాచ్ లో ప్లేయర్లను మారుస్తూనే ఉన్నారు. మరో నెలన్నర రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుండగా ఇప్పటికీ మనకు పూర్తిస్థాయి 15 మంది ఆటగాళ్లు దొరకడం లేదు. సీనియర్ ప్లేయర్లు తప్ప కొత్తగా వస్తున్న వారిలో ఎవరు ఏ మ్యాచ్ లో ఆడుతున్నారో అర్థం కాని పరిస్థితి.
తాజాగా ఇదే విషయమై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తో పాటు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఇదే కామెంట్ చేశారు. భారత తాజా మాజీలే కాదు పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షోయభ్ అక్తర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇది ఇండియాకు గుణపాఠమని.. దీన్నుంచి పాఠాలు నేర్చుకోకుంటే రాబోయే కీలక టోర్నీలో భారత జట్టుకు కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నాడు.
శ్రీలంకతో మ్యాచ్ తర్వాత హర్భజన్ ట్విటర్ వేదికగా.. ‘150 కిలోమీటర్ల స్పీడ్ తో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్ ఎక్కడ..? స్వింగ్ బౌలింగ్ లో దిట్ట అయిన దీపక్ చాహర్ ను ఎందుకు ఆడించడం లేదు..? దినేశ్ కార్తీక్ కు ఎందుకు అవకాశాలు రావడం లేదు..? వీళ్లంతా టీమిండియాకు ఆడటానికి పనికిరారా..? చాలా నిరాశగా ఉంది..’ అని ట్వీట్ చేశాడు.
రాబిన్ ఊతప్ప స్పందిస్తూ.. ‘నేను ఆసియా కప్ ప్రారంభం నుంచి చెబుతున్నా.. మనకు మ్యాచ్ లు గెలిచే రేసు గుర్రాలు కావాలి. ఏ స్థానంలో ఎవరు ఆడితే మంచిదనే కచ్చితమైన నమ్మకముండాలి. గత రెండు మ్యాచులలో భారత జట్టులో అది కనిపించలేదు. దీపక్ హుడా ఫినిషర్ కాదు. ఐపీఎల్ లో అతడు లక్నో సూపర్ జెయింట్స్ లో ఒక్క మ్యాచ్ కూడా ఫినిష్ చేయలేదు. మ్యాచ్ లో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్స్ లేవు. ఈ విషయాలపై జట్టు మేనేజ్మెంట్ దృష్టి పెట్టాలి’ అని అన్నాడు.
రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘ఇక్కడ స్పిన్నర్ అవసరం చాలా తక్కువ. ఇటువంటి సందర్భాల్లో మనకు నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ ఉంటే మ్యాచ్ ఫలితం వేరే ఉండేది. భారత్ మహ్మద్ షమీని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు. అతడిని తాపీగా ఇంట్లో ఎందుకు కూర్చోబెడుతున్నారు..? నన్ను ఇది ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున రాణించిన షమీని జాతీయ జట్టుకు ఎందుకు తీసుకోవడం లేదో నాకు అర్థంకావడం లేదు’ అని అన్నాడు.
అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘వచ్చే ఆదివారం ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్ చూద్దామని ఎంతో ఆశించా. కానీ ఇప్పుడు అది జరిగే పనికాదు. అయితే ఈ ఓటములు ఇండియాకు మేల్కొలుపు. ఇప్పటికైనా రోహిత్.. తన తుది జట్టుపై ఓ క్లారిటీకి రావాలి. ఇప్పటికైతే జట్టు చాలా వీక్ గా కనబడుతున్నది. టీమిండియాకు నాణ్యమైన ఐదుగురు బౌలర్లు కావాలి. ఆ విషయంలో జట్టు మేనేజ్మెంట్ దృష్టి పెట్టాలి. ఆసీస్ వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ కు సమయం తక్కువగా ఉంది. ఆసియా కప్ లో ఓడటం ద్వారా ఇండియాకు మంచే జరిగింది. వాళ్లకు లోపాలు ఏంటో స్పష్టంగా తెలిసొచ్చాయి. ఇప్పటికైనా వాళ్లు ప్లేయింగ్ లెవన్ ను ఎంచుకుని వారినే ఆడించాలి. అదీగాక ఫీల్డ్ లో రోహిత్ చాలా అసౌకర్యంగా కనిపిస్తున్నాడు. అతడు తన దృక్పథాన్ని మార్చుకోవాలి...’ అని చెప్పాడు.
