Asianet News TeluguAsianet News Telugu

కెప్టెన్‌గా యశ దుల్, ఆంధ్రా కుర్రాడికి వైస్ కెప్టెన్సీ... అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీకి టీమిండియా ఎంపిక...

జనవరి 14 నుంచి వెస్టిండీస్ వేదికగా అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ... కెప్టెన్‌గా ఢిల్లీ ప్లేయర్ యశ్ దుల్, వైస్ కెప్టెన్‌గా ఆంధ్రా ప్లేయర్ షేక్ రషీద్... 

Four time Champion India announced Under-19 world cup squad, Yash Dhull, Andhra Player SK Rashid
Author
India, First Published Dec 19, 2021, 6:53 PM IST

Under-19 World cup 2022: వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీకి జట్టును ప్రకటించింది టీమిండియా. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టాండ్ బై ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షేక్ రషీద్‌కి వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కింది...

డిసెంబర్ 23 నుంచి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్‌ టోర్నీలో పాల్గొనే భారత యువ జట్టు, ఆ తర్వాత జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటుంది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకూ వెస్టిండీస్ వేదికగా వన్డే ఫార్మాట్‌లో అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది...

ఆసియా కప్ టోర్నీకి 7 సార్లు గెలిచి, అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచిన భారత అండర్-19 టీమ్, నాలుగు సార్లు వరల్డ్ కప్ సాధించి అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టుగానూ ఉంది. 2020 అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ చేరిన భారత జట్టు, ఫైనల్‌లో బంగ్లా చేతుల్లో ఓడింది...

ఢిల్లీకి చెందిన యష్ దుల్, ఆసియా కప్ టోర్నీతో పాటు అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలోనూ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. 

 

అండర్-19 వరల్డ్ కప్ టోర్నీకి భారత జట్టు ఇది: యశ్ దుల్ (కెప్టెన్), షేక్ రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, నిశాంత్ సింధు, సిద్థార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బనా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరాక్, కుశాల్ తంబే, ఆర్‌ఎస్ హంగర్కేర్, వసు వాత్స్, విక్కీ ఉత్సవల్, రవి కుమార్, గర్వ్ సంగ్వాన్

స్టాండ్ బై ప్లేయర్లు: రిషిత్ రెడ్డి, ఉదయ్ శరవణ్, అన్ష్ ఘోసాయ్, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోర్

జనవరి 15న సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడే యంగ్ టీమిండియా, జనవరి 19న ఐర్లాండ్‌తో, జనవరి 22న ఉగాండాతో మ్యాచులు ఆడుతుంది. 

 హైదరాబాద్‌కి చెందిన రిషిత్ రెడ్డికి స్టాండ్ బై ప్లేయర్‌గా చోటు దక్కగా, వైస్ కెప్టెన్ రషీద్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్ జిల్లాకి చెందినవాడు. వీరంతా బెంగళూరులోని ఎన్‌సీఏలో వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం భారత వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అండర్-19 టీమ్‌కి సలహాలు, సూచనలు ఇచ్చాడు. 

1988లో మొదటిసారి అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ మొదలు కాగా, 2000వ సంవత్సరంలో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో తొలిసారి టైటిల్ గెలిచింది భారత జట్టు. ఆ తర్వాత 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రెండోసారి టైటిల్ సాధించింది టీమిండియా. 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన భారత జట్టు, 2018లో పృథ్వీషా కెప్టెన్సీలో నాలుగో సారి టైటిల్ సాధించింది...

2020 ఏడాదిలో ప్రియమ్ గార్గ్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన భారత జట్టు, బంగ్లా చేతుల్లో 3 వికెట్ల తేడాతో ఓడింది. ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత బంగ్లా, భారత జట్టు క్రికెటర్లు స్టేడియంలోనే కొట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది...

ఐపీఎల్‌లో అదరగొడుతున్న కార్తీక్ త్యాగి, యశస్వి జైస్వాల్, రవిభిష్ణోయ్ వంటి ప్లేయర్లు.. అండర్ 19 వరల్డ్ కప్ 2020 నుంచి వచ్చినవాళ్లే కావడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios