Asianet News TeluguAsianet News Telugu

లారా రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా సారథి.. ప్రశంసలు కురిపించిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్

ENG vs IND: టీమిండియా తాత్కాలిక సారథి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న తొలి టెస్టులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో అతడు ఏకంగా 29 పరుగులు చేశాడు. దీంతో బుమ్రా పై  ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
 

Former West Indies Skipper Brian Lara Congratulates Jasprit Bumrah on Breaking His Record
Author
India, First Published Jul 3, 2022, 11:08 AM IST

టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టు పగ్గాలు మోస్తున్న తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా.. నాయకుడిగా తొలి టెస్టులోనే బ్యాటింగ్ లో వీరవిహారం చేశాడు. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్  లో వీరబాదుడు బాది ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఎడ్జబాస్టన్ టెస్టులో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో భాగంగా బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో 29 పరుగులు సాధించాడు.  వైడ్, ఫోర్, నోబ్ తో కలిసి ఆ ఓవర్లో మొత్తంగా 35 పరుగులొచ్చాయి. టెస్టు క్రికెట్ లో ఒకే ఓవర్లో 35 పరుగులు చేయడం  ప్రపంచ రికార్డు. 

గతంలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాతో ఆడిన ఓ టెస్టులో లారా ఒకే ఓవర్లో  28 పరుగులు రాబట్టాడు. అయితే తాజాగా బుమ్రా.. ఆ రికార్డును బద్దలుకొట్టాడు. దీంతో  లారా.. తన రికార్డును బద్దలుకొట్టిన బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. 

ట్విటర్ వేదికగా లారా స్పందిస్తూ.. ‘ఒక ఒవర్లో అత్యధిక పరుగులు  చేసిన ఆటగాడిగా నా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టినందుకు జస్ప్రీత్ బుమ్రా కు కృతజ్ఞతలు. వెల్ డన్ బుమ్రా’ అని ట్వీట్ చేశాడు. 

 

2003లో వాండరర్స్  లో జరిగిన దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ టెస్టులో లారా.. సఫారీ బౌలర్ రాబిన్ పీటర్సన్ బౌలింగ్ లో 28 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో లారా.. 4, 6, 6, 4, 4, 4 తో 28 పరుగులు రాబట్టాడు.  టెస్టులలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు నమోదైన ఓవర్ అదే. ఇప్పుడు బుమ్రా  ఆ రికార్డును బద్దలుకొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు.   

 

బ్రాడ్ వేసిన 84 ఓవర్లో బుమ్రా విధ్వంసం సాగిందిలా.. 4,  4 (వైడ్), 6 (నోబాల్), 4, 4, 6, 1.. ఇలా మొత్తంగా ఒక ఓవర్లో 35 పరుగులు పిండుకున్నాడు బుమ్రా. ఇదే బ్రాడ్.. 2007 టీ20 ప్రపంచకప్ లో యువరాజ్ చేతిలో బాధితుడయ్యాడు. ఆ టోర్నీలో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన విషయం టీమిండియా అభిమానులు ఇప్పట్లో మరిచిపోలేరు.  

Follow Us:
Download App:
  • android
  • ios