టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లలో కొందరి పిల్లలకు సెహ్వాగ్ తన అంతర్జాతీయ స్కూల్‌లో క్రికెట్ శిక్షణ ఇస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను వీరేంద్రుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.

తన స్కూల్‌లో ఈ చిన్నారులకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నానని.. వీరు అమరవీరుల బిడ్డలని...బ్యాటింగ్ చేస్తున్న చిన్నారి అమర జవాన్ రామ్ వకీల్ కుమారుడు ఆర్పిత్ సింగ్, బౌలింగ్ చేస్తున్న బాలుడు అమర జవాన్ విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ సోరెంగ్ అని తెలిపాడు.

ఇంతకన్నా ఆనందాన్నిచ్చే పనులు ఉంటాయా అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. దీనిపై పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు ఎంతో కొంత తిరిగి ఇవ్వడం మన విధని నెటిజన్లు కొనియాడారు.

కాగా మరో భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ సైతం పుల్వామా అమరవీరుల కుటుంబాలకు చెందిన 100 మంది చిన్నారుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. వారి చదవులుకు అయ్యే వ్యయాన్ని గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ తరపున తానే చెల్లిస్తానని గంభీ పేర్కొన్నాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సీఆర్‌పీఎఫ్ వాహన శ్రేణిపై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్ధ ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

అమర జవాన్ల త్యాగానికి నివాళిగా పలువురు ప్రముఖులు సైనికుల కుటుంబాలకు బాసటగా నిలిచారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున విరాళంగా  ప్రకటించారు.

అలాగే హర్యానా పోలీస్ శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న బాక్సర్ విజేందర్ సింగ్ తన నెల జీతాన్ని అమర వీరుల కుటుంబాలకు అందజేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదే సమయంలో అమర జవాన్ల పిల్లలను చదివించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు వీరేంద్ర సెహ్వాగ్.  తాను స్థాపించిన సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జవాన్ల పిల్లలందరికీ ఉచితంగా విద్యను అందిస్తానని తెలిపాడు. అప్పుడు చెప్పిన మాటను సెహ్వాగ్ నిలబెట్టుకున్నాడు .