క్రికెడ్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్, లిటిల్ మాస్టర్ ఇలా అభిమానులు ముద్దుగా పిలుచుకునే సచిన్ రమేశ్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి శుక్రవారం నాటికి 30 సంవత్సరాలు.. 1989 నవంబర్ 15న కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడటం ద్వారా సచిన్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.

నాటి నుంచి 24 ఏళ్ల పాటు ఇండియన్ క్రికెట్‌కు ఎనలేని సేవ చేశాడు. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా బౌలర్‌గా, కెప్టెన్‌గా కీలకపాత్రలు పోషించాడు. తన క్లాస్ బ్యాటింగ్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు.

16 ఏళ్ల అతి చిన్న వయసులోనే జట్టులోకి అడుగుపెట్టిన టెండూల్కర్..తన తొలి మ్యాచ్‌లోనే వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనిస్ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని 35.83 సగటుతో 215 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో వకార్ యూనిస్ వేసిన బంతికి గాయపడినప్పటికీ, తడబడకుండా హాఫ్ సెంచరీ చేశాడు.

తన సుధీర్ఘ కెరీర్‌లో 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 34,347 పరుగులు చేశాడు. వంద క్రికెటర్లు సాధించిన తొలి క్రికెటర్‌గా, వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా ఇలా మరెవరికీ సాధ్యం కానన్ని రికార్డులు నెలకొల్పి క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నాడు.

తన చిరకాల స్వప్నం ప్రపంచకప్‌ను ముద్ధాడిన తర్వాత 2012 డిసెంబర్ 23న వన్డే క్రికెట్‌కు.... 2013 అక్టోబర్ 10న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

సచిన్ గురించి ఆసక్తికర విశేషాలు: 

* 1987 వరల్డ్‌కప్‌లో భారత్, జింబాబ్వే మధ్య వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ బాల్ బాయ్‌గా పనిచేశాడు. 

* 1988లో పాకిస్తాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టెండూల్కర్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆడాడు

* సచిన్ సొంతం చేసుకున్న మొదటి కారు మారుతి 800

* థర్డ్ అంపైర్‌ నిర్ణయం కారణంగా ఔటైన తొలి ఆటగాడు సచినే

* కౌంటీ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా సచిన్ రికార్డుల్లోకి ఎక్కాడు.

* రంజీ, దులీప్ కప్, ఇరానీ ట్రోఫీల్లో అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే శతకాలు బాదాడు

* సచిన్ నటించిన బూస్ట్ వాణిజ్య ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం నటించింది.