అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో అధికారికంగా చేరడంపై టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ హర్షం వ్యక్తం చేశారు. వీటి చేరికతో వాయుసేన శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని మహీ పేర్కొన్నాడు.

భీకరంగా పోరాడే అత్యుత్తమ ఫైటర్ జెట్ పైలట్లు వీటిని నడుపుతారని ధోనీ వెల్లడించాడు. కాగా దేశభక్తి మెండుగా ఉన్న మహేంద్రుడు.. భారత సైన్యానికి సంబంధించిన అంశాల్లో ఎప్పుడు ముందుంటాడు.

టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్ట్‌నెంట్ హోదాలో ఉన్న ధోనీ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఏటా సరిహద్దుల్లోకి వెళ్లి విధులు నిర్వర్తిస్తుంటాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత మహీ రెండు నెలల పాటు సైన్యంలో పనిచేశాడు. చివరికి పద్మభూషణ్ పురస్కారాన్ని సైతం మిలటరీ యూనిఫారంలోనే అందుకున్నాడు.

కాగా రఫేల్ గురించి గురువారం ట్వీట్ చేసిన ధోనీ... పోరాటాల్లో తన  సత్తాను ఘనంగా చాటుకున్న 4.5వ తరం యుద్ధవిమానాలను గొప్ప పైలట్లు నడుపుతారని వెల్లడించాడు. రఫేల్ ఫైటర్ల రాకతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత ప్రమాదకరంగా, పరాక్రమంగా, పటిష్టంగా మారిందని ధోనీ ప్రశంసించాడు.

ఇదే సమయంలో 17వ స్క్వాడ్రన్‌కు ఆయన అభినందలు తెలియజేశాడు. మిరేజ్ 2000 సేవా రికార్డులను రఫేల్ బద్ధలు కొడతాయని ఆయన ఆకాంక్షించాడు. అయితే సుఖోయ్ 30 ఎంకేఐ తనకు ఎప్పటికీ ఇష్టమని.. ఇవి సూపర్ సుఖోయ్‌గా అప్‌డేట్ అవ్వాలని ధోనీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు