Asianet News TeluguAsianet News Telugu

Rudi Koertzen: రోడ్డు ప్రమాదంలో మరణించిన దిగ్గజ అంపైర్.. ‘ది స్లో ఫింగర్ ఆఫ్ డెత్’ అస్తమయం

Rudi Koertzen: దక్షిణాఫ్రికా మాజీ అంపైర్, ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్ సభ్యుడు రుడీ కోర్ట్‌జెన్ కారు ప్రమాదంలో మరణించారు. గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన ఆయన.. తిరుగు ప్రయాణంలో  ప్రమాదానికి గురయ్యారు.

Former South African Umpire Rudi Koertzen Passes Away in Car Accident
Author
First Published Aug 9, 2022, 5:57 PM IST

క్రికెట్‌లో ఆటగాళ్లు గుర్తున్నంతగా  ఆటను నడిపించే అంపైర్లు గుర్తుండరు. కానీ ఈ జాబితాలో  ఆటగాళ్లతో పాటు గుర్తుంచుకునే పేర్లలో కచ్చితంగా ఉండేవారిలో దక్షిణాఫ్రికాకు చెందిన రుడీ  కోర్ట్‌జెన్ కూడా ఒకరు.  అలీమ్ దార్ (పాకిస్తాన్) తర్వాత అత్యధిక మ్యాచ్‌లకు అంపైర్ గా వ్యవహరించిన  కోర్ట్‌జెన్ మంగళవారం కన్నుమూశారు. 73 ఏండ్ల కోర్ట్‌జెన్.. మంగళవారం కారు ప్రమాదంలో మరణించాడని ఆయన కుమారుడు రుడీ కోర్ట్‌జెన్ జూనియర్ తెలిపాడు. 

తన మిత్రులతో కలిసి గోల్ఫ్ ఆడేందుకు గానూ సోమవారం తన ఇంటినుంచి వెళ్లిన కోర్ట్‌జెన్..  అక్కడే ఆగిపోయారు. కానీ మంగళవారం ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కోర్ట్‌జెన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో కోర్ట్‌జెన్ తో పాటు మరో ముగ్గురు కూడా  ప్రమాదస్థలిలోనే ప్రాణాలొదిలారని ఆయన కుమారుడు వెల్లడించాడు. 

కోర్ట్‌జెన్.. 1992 డిసెంబర్ నుంచి  2010 జులై  వరకు అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్ గా పనిచేశాడు. 108 టెస్టులు, 209 వన్డేలు, 14 టీ20లకు అంపైర్ గా పనిచేసిన  కోర్ట్‌జెన్..  పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్, స్టీవ్ బక్నర్ తర్వాత అత్యధిక టెస్టులకు అంపైర్ గా చేసిన ఘనత సాధించాడు.

 

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో భాగంగా వన్డే క్రికెట్ లో రనౌట్లను నిర్దారించేందుకు గాను ప్రవేశపెట్టిన తొలి  మ్యాచ్ కు కోర్ట్‌జెన్ అంపైర్. అంపైర్ గా అతడికి అది తొలి వన్డే కావడం మరో విశేషం. అంతేగాక.. ఎక్కువగా భారత్-పాక్, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా (యాషెస్) మ్యాచ్ లకు  కోర్ట్‌జెన్ నే అంపైర్ గా నియమించేది ఐసీసీ.  

బ్యాటర్ క్యాచ్ ఔట్, స్టంప్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్ అయినప్పుడు  ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చే విధానం కూడా హైలైట్ గా ఉండేది. మెల్లిగా  చేతికి  పైకెత్తుతూ ఆయన  ఔట్ ఇచ్చే విధానానికి కూడా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో దీనిని  ‘ది స్లో ఫింగర్ ఆఫ్ డెత్’ అని పిలిచేవారు. అంపైర్ గానే గాక  కోర్ట్‌జెన్.. 41 వన్డేలు, 5 టీ20లు, 20 టెస్టులకు థర్డ్ అంపైర్ గా వ్యవహరించాడు.  కోర్ట్‌జెన్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్ సభ్యుడు కూడా.. కోర్ట్‌జెన్ మృతికి వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఐసీసీ తో పాటు క్రికెట్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios