Graeme Smith: దక్షిణాఫ్రికా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్ ను ముందుకు నడిపించే నాయకుడు దొరికాడు.  

ఐపీఎల్ వ్యూహకర్తల ‘అండ’తో దక్షిణాఫ్రికాలో నిర్వహించబోతున్న టీ20 లీగ్ కు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆరు జట్లతో నిర్వహించబోతున్న ఈ లీగ్ జనవరి-ఫిబ్రవరిలో మొదలుకానుంది. జోహన్నస్బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్, కేప్టౌన్ లతో కూడిన జట్లకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ ఇప్పటికే తుది రూపునకు వచ్చిందని త్వరలోనే ఈ ఫ్రాంచైజీలను గెలిచిన ఓనర్లను ప్రకటించే అవకాశముంది. అయితే గతానుభవాల దృష్ట్యా ఈసారి టీ20 లీగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని ఆశయంతో ఉన్న దక్షిణాఫ్రికా కు ఈ లీగ్ ను నడిపించే మార్గదర్శకుడు దొరికాడు. సౌతాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ ను ఈ లీగ్ కమిషనర్ గా నియమించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. 

స్మిత్ ను కమిషనర్ గా నియమించడం వెనుక అతడి కృషి కూడా ఉంది. దక్షిణాఫ్రికాను ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టెస్టు జట్టుగా నిలపడంలో స్మిత్ పాత్ర ప్రశంసనీయం. 

ప్రపంచ టెస్టుక్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా అతడి పేరిట ఇప్పట్లో చెరిగిపోని రికార్డు ఉంది. 109 టెస్టులకు సారథ్యం వహించిన స్మిత్.. ఏకంగా 53 విజయాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. స్టీవ్ వా, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు సైతం స్మిత్ తర్వాత స్థానంలోనే ఉన్నారు. 

Scroll to load tweet…

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును విజయవంతంగా నడిపిన అతడైతేనే ఈ లీగ్ ను సమర్థవంతంగా నడపగలడని సీఎస్ఎ భావించి అతడికి లీగ్ కమిషనర్ బాధ్యతలను అప్పజెప్పింది. కాగా తనను లీగ్ కమిషనర్ గా నియమించినందుకు గాను స్మిత్ స్పందిస్తూ.. ఇది తనకు దక్కిన గౌరవమని, ఈ లీగ్ ను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపాడు. 

పలు రిపోర్టుల ప్రకారం పైన పేర్కొన్న జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లే దక్కించుకున్నట్టు తెలుస్తున్నది. కేప్ టౌన్ కు ముంబై ఇండియన్స్ (అంబానీ), జోహన్నస్బర్గ్ కు చెన్నై సూపర్ కింగ్స్ (ఎన్. శ్రీనివాసన్), ప్రిటోరియాకు ఢిల్లీ క్యాపిటల్స్ (పార్థ్ జిందాల్), డర్బన్ కు లక్నో (సంజీవ్ గొయెంకా), పోర్ట్ ఎలిజిబెత్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ (కళానిది మారన్), పార్ల్ కు రాజస్తాన్ రాయల్స్ (మనోజ్ బదాలే) లు ‘మద్దతు’నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా.

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ యజమానులు సీఎస్ఎ టీ20 లీగ్ లో అక్కడి ఫ్రాంచైజీలలో పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తున్నది.