కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తొలుత చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు 19లక్షల మందికి ఈ వైరస్ సోకగా.. లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా.. ఈ వైరస్ కారణంగా పాక్ క్రికెటర్ ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో.. యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యింది.

 కోవిడ్-19 సోకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ మృతి చెందారు. అంతకు ముందే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆయన్ని ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడంతో తుది శ్వాస విడిచారు.

1988లో జాఫర్ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన ఆయన తన కెరీర్‌లో 15 ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి.. 616 పరుగులు చేశారు. ఆరు సంవత్సరాలు క్రికెట్ ఆడిన ఆయన 1994లో రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఆయన కెరీర్‌లో ఆరు దేశవాళీ వన్డేలు ఆడిన ఆయన.. ఆ ఫార్మాట్‌లో 96 పరుగులు చేశారు. రిటైర్‌మెంట్ తర్వాత సర్ఫరాజ్ కోచింగ్ బాధ్యతలు చేపట్టారు. సీనియర్ టీమ్‌తో పాటు.. పెషావర్ అండర్-19 టీమ్‌కి కూడా ఆయన కోచింగ్ ఇచ్చారు.