పాకిస్థాన్ క్రికెట్లో ఈ మధ్యకాలంలో చాలా రాజకీయాలు జరిగాయని మాజీ చీ ఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్ ఆరోపించారు. ముఖ్యంగా తనను పదవి నుండి తొలగించడానికి కొందరు కుట్రలు పన్నారని తెలిపాడు. అందువల్లే పిసిబి తన కాంట్రాంట్ ను పొడిగించకుండా పదవీచ్యుతున్ని చేసినట్లు తెలిపాడు. ఇదంతా చేసింది తనతో ఎంతో సన్నిహితంగా మెలిగిన మిస్బావుల్ హక్, వసీం అక్రమ్ లేనని ఆర్థర్ సంచలన ఆరోపణలు చేశారు. 

''పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ వేదికన జరిగిన ఐసిసి వన్డే వరల్డ్ కప్ ఘోరంగా విఫలమైన విషయం అందరికి తెలిసిందే. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డ్ జట్టు ప్రక్షాళన కోసం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సభ్యులు జట్టులోని లోపాలను, ప్రపంచ కప్ వైఫల్యానికి గల కారణాలపై ఓ నివేదిక రూపొందించి పిసిబికి అప్పగించింది. అందులో ముఖ్యంగా చీఫ్ కోచ్ గా నన్ను తొలగించాలని సిపార్సు చేసింది. 

ముఖ్యంగా ఈ కమిటీలో నాకు అత్యంత సన్నిహితులైన మాజీ క్రికెటర్లు మిస్బావుల్ హక్, వసీం అక్రమ్ లు వున్నారు. దీంతో నా పదవికి ఎలాంటి దోఖా రాదని భావించాను. తన కాంట్రాక్ట్ ను కూడా పిసిబి పొడిగిస్తుందన్న నమ్మకంతో వున్నాను. కానీ మిస్బా నా పదవిపై కన్నేసినట్లు తెలియదు. 

మిస్బా, అక్రమ్ మిగతా కమిటీ సభ్యులను ప్రభావితం చేసి తనకు వ్యతిరేకంగా రిపోర్ట్ తయారుచేశారు. వారి నమ్మకద్రోహం వల్లే నేను పాకిస్థాన్ చీఫ్ కోచ్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. లేదంటే మరికొంత కాలం ఆ పదవిలో కొనసాగేవాడిని. 

ఎలాగయితేనేం మిస్బా పాకిస్థాన్ చీఫ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ పదవిని చేపట్టాడు. అతడు మంచి టాలెంటెడ్ ఆటగాడు. కోచ్ గా కూడా తన బాధ్యతలను  సక్రమంగా నిర్వర్తిస్తాడని ఆశిస్తున్నా. పిసిబి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాక్ జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా. నన్ను నమ్మకద్రోహం చేసినప్పటికి మిస్బా సక్సెస్‌ఫుల్ కోచ్ గా పేరుతెచ్చుకోవాలనే నేను కోరుకుంటున్నా.'' అని ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.