ఒకప్పుడు ఐపిఎల్ స్టార్ క్రికెటర్: ఇప్పుడు చోర్, కారులో నివాసం
ఐపిఎల్ లో ఒకప్పుడు స్టార్ క్రికెటర్ అయిన ల్యూక్ పోమర్స్ బ్యాచ్ పై చోరీ కేసులు నమోదయ్యాయి. అతనిపై కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కారులో తలదాచుకుంటున్నాడు.
సిడ్నీ: ఒకప్పుడు టీ20 మ్యాచుల్లో ఇరగదీసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లూక్ పోమర్స్ బాచ్ దొంగగా మారిపోయాడు. ప్రస్తుతం ఓ కారులో నివాసం ఉంటూ అరెస్టును తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆస్ట్రేలియా మీడియాలో ఈ మేరకు వార్తాకథనాలు వచ్చాయి.
35 ఏళ్ల పోమర్స్ బాచ్ పెర్త్ లో గత నెలలో జరిగిన రెండు సంఘటనలకు సంబంధించి బుధవారంనాడు కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయం 10.30 గంటలకు అతను కోర్టుకు రాలేదు. దాంతో కోర్టు అతనిపై అరెస్టు వారంట్ జారీ చేసింది.
నూతన సంవత్సరం రోజున ఇన్నాలూలో అతను ఓ షాపింగ్ సెంటర్ ముందు ఉన్న సైకిలును దొంగిలించాడని అతనిపై చార్జిషీట్ లో ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కొన్ని వారాలకు అతను ఓ మద్యం దుకాణం నుంచి 10 ప్యాకెట్ల ప్రీ మిక్స్ డ్ స్పిరిట్స్ ను దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చాయి.
లూక్ పోమర్స్ బ్యాచ్ 2007లో ఆస్ట్రేలియా తరఫన ఒకే ఒక టీ20 ఆడాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచులో అతను 7 బంతుల్లో 15 పరుగులు చేశాడు. దాంతో తర్వాతి ఏడాది జరిగిన ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళోూర్ తరఫున కూడా ఆడాడు. 2008 నుంచి 2013 వరకు అతను ఐపిఎల్ లో ఆడుతూ వచ్చాడు.
2013లో అతన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతన్ని 3 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై అతను ఐపిఎల్ లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అతను మొత్తం 17 మ్యాచుల్లో 122 ప్లస్ స్ట్రయిక్ రేటుతో 302 పరుగులు చేశాడు. 2012 ఐపిఎల్ సీజన్ లో ఓ అమెరికా యువతిని వేధించడంతో లూక్ పోమర్స్ బ్యాచ్ అరెస్టయ్యాడు. 2014లో క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు. క్రమంగా వ్యసనాలకు బానిసయ్యాడు. బిగ్ బాష్ లీగ్ లో కూడా అతను ఆడాడు.