Suresh Raina Father Died: భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట  తీవ్ర విషాదం..  రైనా ఎంతగానో ఇష్టపడే అతడి తండ్రి ఆదివారం...

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్చంద్ రైనా ఆదివారం కన్నుమూశారు. కొద్దికాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న త్రిలోక్చంద్.. ఆదివారం తెల్లవారుజామునే ఘజియాబాద్ లోని తన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. అయితే తన తండ్రి మరణాన్ని రైనా వెల్లడించలేదు. ఆ విషయాన్ని దాచి మరీ ఆదివారం మరణించిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి సంతాపం ప్రకటించాడు రైనా.. 

త్రిలోక్చంద్ రైనా పూర్వీకులది జమ్మూకాశ్మీర్ లోని రైనావరి. అయితే 1980వ దశకంలో అక్కడ తలెత్తిన గొడవల కారణంగా చాలా మంది కాశ్మీరి పండిట్లు.. జమ్మూను వీడి వలస వచ్చారు. వారిలో త్రిలోక్చంద్ కుటుంబం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు వలస వచ్చిన త్రిలోక్చంద్ ఆర్మీలో పనిచేసేవాడు.

Scroll to load tweet…

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసిన త్రిలోక్చంద్.. బాంబులు చుట్టడంలో దిట్ట. అప్పట్లో తనకు వచ్చిన నెలకు రూ. 10వేల వేతనంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో త్రిలోక్చంద్.. క్రికెటర్ కలలు కన్న రైనా కోరికను కాదనలేకపోయాడు. 1998 లో రైనా.. లక్నోలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో చేరాడు. అక్కడే క్రికెట్ లో మెలుకువలు నేర్చి క్రమంగా భారత జట్టులో స్టార్ గా ఎదిగాడు. 

తండ్రి అంటే రైనాకు ఎంతో ఇష్టం. ఆయన తన జీవితంపై ఎంతో ప్రభావం చూపానంటాడు రైనా. ఇండియాలో సిరీస్ లు ఆడుతున్నా.. విదేశీ టూర్ లు లేకున్నా రైనా సరాసరి తన తండ్రితో గడపడానికి ఘజియాబాద్ వెళ్లేవాడు.

Scroll to load tweet…

కాగా.. తాను ఎంతగానో ఇష్టపడే తండ్రి మరణాన్ని దాచి మరీ లతాజీ కి నివాళిలర్పించాడు రైనా.. అతడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘భారత రత్న లతా దీదీ మరణం నన్ను కలిచివేసింది. మా జీవితాల్లో మీ వారసత్వం ఎప్పటికీ నిలిచిఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి.. ’ అని ట్వీట్ చేశాడు. ఇదిలాఉండగా రైనా తండ్రి మరణంపై పలువురు భారత క్రికెటర్లు స్పందించారు. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. రైనా తండ్రికి నివాళి అర్పించాడు. రైనా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించాడు.