తాను చీమకు కూడా హాని చేయనని... అలాంటిది ఓ మనిషిని ఎలా కొడతానని ఇండియన్ మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల ఆయన తాగి, పొరిగింటి వ్యక్తిని కొట్టాడంటూ.. ప్రవీణ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై ప్రవీణ్ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు.

తాను చీమకు కూడా హాని చేసే రకం కాదని, అలాంటిది మనుషుల్ని ఎలా కొడతానని ప్రశ్నించాడు. తానో అంతర్జాతీయ క్రికెటర్‌నని తానెప్పుడూ చీమను కూడా చంపలేదని పేర్కొన్నాడు. అలాంటిది చిన్నపిల్లాడిపై దాడి ఎలా చేస్తానని ప్రశ్నించాడు. తనకూ ఓ పాప, ఓ బాబు ఉన్నారన్నాడు. తాను కారు దిగుతున్నప్పుడు ఆ బాలుడు, అతడి తండ్రి తనను లాగిపడేశారని ఆరోపించాడు.

అయితే... బాధితుల  వాదన మరోలా ఉంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... దీపక్ శర్మ అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడితో కలిసి బస్ స్టాప్‌లో వేచి చూస్తున్నారు. ఇంతలో కారులో అక్కడికి చేరుకున్న ప్రవీణ్, బస్ డ్రైవర్‌ను దూషించాడు. అక్కడితో ఆగక దీపక్, అతడి కుమారుడిపై దాడిచేశాడు. ప్రవీణ్ కుమార్ దాడిలో తన చేయి విరిగిపోయినట్టు దీపక్ తెలిపాడు. మద్యం సేవించి ప్రవీణ్ తమపై దాడి చేశారని వారు వాదిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. దీపక్, ప్రవీణ్ కుమార్ ఇద్దరూ ఇరుగుపొరుగు వారేనని పేర్కొన్నారు.  ఈఘటనపై ఇద్దరూ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
 
ప్రవీణ్ కుమార్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2007 నవంబర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ప్రవీణ్.. 2012లో దక్షిణాఫ్రికాతో చివరి మ్యాచ్ ఆడాడు. ఐదేళ్ల కెరియర్‌లో ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 112 వికెట్లు తీశాడు.