Asianet News TeluguAsianet News Telugu

Asad Rauf: అప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు పాకిస్తాన్ వీధుల్లో చెప్పులు అమ్ముకుంటూ..

Asad Rauf: ఒకప్పుడు ఆయన ఐసీసీ ఎలైట్ ప్యానెల్ లో అంపైర్ గా ఓ వెలుగు వెలిగారు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సాఫీగా సాగుతున్న కాలంలో వచ్చిన ఆరోపణలతో ఆయన జీవితం తలకిందులైంది. 

Former ICC elite panel umpire Asad Rauf on turning shopkeeper, Sells Shoes and Cloths in Lahore
Author
India, First Published Jun 24, 2022, 2:45 PM IST

పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్, ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి  (ఐసీసీ) ప్యానెల్ లో ఓ వెలుగు వెలిగిన అసద్ రవూఫ్.. ప్రస్తుతం జీవనోపాధి కోసం దుస్తులు, చెప్పులు అమ్ముతున్నాడు.  చాలాకాలంగా క్రికెట్ కు దూరమైన  అతడు లాహోర్ లోని లండా బజార్ లో ఓ చిన్నపాటి దుకాణం పెట్టుకుని అందులో సెకండ్ హ్యాండ్ దుస్తులు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, చెప్పులు, షూస్ అమ్ముకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. స్థానిక మీడియా అతడిని గుర్తించడంతో అతడు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

అంతర్జాతీయ క్రికెట్ లో 13 ఏండ్ల పాటు అంపైర్ గా సేవలందించాడు రవూఫ్.  పాకిస్తాన్ దేశవాళీలో 71 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన రవూఫ్..  98 వన్డేలు, 49 టెస్టులు, 23 టీ20  లకు అంపైర్ గా వ్యవహరించాడు. మరి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రవూఫ్ జీవితం ఇలా మారడానికి కారణాలేంటి..?  

ఐపీఎల్-2013 సీజన్ సందర్భంగా రవూఫ్ బుకీల నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీసీ అతడిపై ఐదేండ్ల నిషేధం విధించింది. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ అతడి కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోయింది. అంతేగాక.. 2012లో ముంబైకి చెందిన ఓ మోడల్ ను పెళ్లి చేసుకుంటానని మోసగించాడని, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కూడా ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలో లాహోర్ లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో 66 ఏండ్ల అసద్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ప్రస్తుత పరిస్థితిపై రవూఫ్ మాట్లాడుతూ.. తాను తన కూతురు, కొడుకు ఆరోగ్యం బాగోలేని కారణంగా  అంపైరింగ్ వదిలేశానని, మళ్లీ దానిపైపునకు తిరిగి చూడలనిపించలేదని చెప్పుకురావడం గమనార్హం. తనకు డబ్బు అంటే మోజు లేదని.. తన షాపులో పనిచేసే సిబ్బందికి రోజూ కూలీ చెల్లించాలనే ఉద్దేశంతోనే ఈ పనిలో భాగమవుతున్నానని తెలిపాడు. 

 

‘నేను చాలా డబ్బులు చూశాను.  నేను ప్రపంచంలో చాలా చోట్లకు వెళ్లాను. ప్రోటోకాల్ తో నన్ను గౌరవించారు. కానీ నా కొడుకులలో ఒకరికి ఆరోగ్యం బాగోలేదు.  అందుకే నేను అంపైరింగ్ వదిలేశాను. నేను ఏది ప్రారంభించినా దాన్లో పీక్స్ చూశాను..’ అని చెప్పుకొచ్చాడు. 

ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందిస్తూ.. ‘నేను ఐపీఎల్ లో చాలా ఎంజాయ్ చేశాను.  ఆ ఆరోపణ (స్పాట్ ఫిక్సింగ్)లతో నాకు సంబంధం లేదు. ఆ ఆరోపణలు చేసింది బీసీసీఐ. వాళ్లు దానిమీద నిర్ణయం తీసుకున్నారు. ఇక మహిళపై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా నేను 2013 ఐపీఎల్ సీజన్ లో అంపైరింగ్ చేశాను..’ అని  వ్యాఖ్యానించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios