Asianet News TeluguAsianet News Telugu

Alastair Cook: 15 వేల పరుగులు చేసిన దిగ్గజ బ్యాటర్ 15 ఏండ్ల కుర్రాడి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్..

Alastair Cook: ఇంగ్లాండ్ మాజీ సారథి, ఆ జట్టు తరఫున టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించిన అలెస్టర్ కుక్.. 15 ఏండ్ల కుర్రాడి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

Former England Captain Alastair Cook clean Bowled By 15 years Old Bowler, Video Went viral
Author
India, First Published May 25, 2022, 12:57 PM IST

అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడేప్పుడు బౌలర్లకు  కొరకరాని కొయ్య.  ఓపెనర్ గా బరిలోకి దిగే అతడు క్రీజులోకి వచ్చాడంటే ఔట్ చేయడానికి ప్రత్యర్థి జట్ల బౌలర్లు నానా కష్టాలు పడేవారు. ఫీల్డింగ్ మార్పులు,  సారథుల వ్యూహాలేవీ అతడి జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో అయితే అతడు బౌలర్లకు  సింహస్వప్నం. టెస్టులు, వన్డేలలో కలిపి  15వేలకు పైగా పరుగులు చేసిన  ఇంగ్లాండ్ మాజీ సారథి సర్ అలెస్టర్ కుక్.. తాజాగా 15 ఏండ్ల కుర్రాడి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  క్లబ్ క్రికెట్ లో భాగంగా ఈ విశేషం చోటు చేసుకుంది. 

2018 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నా కుక్ కౌంటీలు, క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు.  ఇప్పటికీ అతడు తన సొంత జట్టుగా భావించే ఎసెక్స్ తరఫున క్రికెట్ ఆడతాడు. కాగా హెరిటేజ్ కప్ లో భాగంగా బెడ్ఫోర్డ్షైర్ యంగ్ ఫార్మర్స్ సీసీ - పాటన్ టౌన్ సీసీ మధ్య జరిగిన  మ్యాచ్ లో  ఈ ఘటన చోటు చేసుకుంది. 

బెడ్ఫోర్డ్షైర్ యంగ్ ఫార్మర్స్ సీసీ తరఫున ఆడుతున్న కుక్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. 12 ఓవర్లలో 155 పరుగులు ఛేదించాల్సి ఉండగా  క్రీజులోకి వచ్చిన కుక్.. 20 పరుగులు చేశాడు. కానీ పాటన్ యువ పేసర్ కైరన్ షెకల్టన్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ కుర్రాడి వయసు 15 సంవత్సరాలే. ఫాస్ట్ బౌలర్ గా రాణిస్తున్నాడు. 

 

ఈ మ్యాచ్ లో బెడ్ఫోర్డ్షైర్ యంగ్ ఫార్మర్స్ సీసీ  26 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా కుక్ క్లీన్ బౌల్డ్ అయిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

2006 నుంచి 2018 వరకు ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన కుక్.. ఆ జట్టు తరఫున  161 టెస్టులు ఆడాడు. 2006 లో టీమిండియాతో టెస్టులో (నాగ్పూర్) అరంగేట్రం చేసిన కుక్.. ఆ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఆశ్చర్యకరంగా అతడు తన చివరి టెస్టు కూడా  2018 లో భారత్ తోనే ఆడటం విశేషం.  ఇక టెస్టు క్రికెట్ లో  అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలలో కుక్ ఐదో వాడు. తొలి నాలుగు స్థానాలలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్,  జాక్వస్ కలిస్, రాహుల్ ద్రావిడ్ లు ఉన్నారు.

161 టెస్టులాడిన కుక్.. 12,472 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలున్నాయి. 92 వన్డేలు ఆడి 3,204 పరుగులు చేశాడు. వన్డేలలో 5 సెంచరీలు 19 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కుక్ కు గుర్తింపు దక్కింది. ఇంగ్లాండ్ క్రికెట్ కు అతడు చేసిన సేవలకు గాను ఈసీబీ.. అతడిని ‘సర్’ బిరుదుతో సత్కరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios