Amitabh Chaudhary passes away: బీసీసీఐ మాజీ కార్యదర్శి అమితాబ్ చౌదరి మంగళవారం కన్నుమూశారు. జార్ఖండ్ కు చెందిన ఆయన ఆ రాష్ట్ర క్రికెట్ పురోగతిలో కీలక పాత్ర పోషించారు.
మాజీ ఐపీఎస్ అధికారి, గతంలో బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన అమితాబ్ చౌదరి మంగళవారం ఉదయం కన్నుమూశారు. 58 సంవత్సరాల వయసున్న చౌదరి.. గుండెపోటుతో మరణించినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. జార్ఖండ్‌కు చెందిన ఆయన ఐపీఎస్ అధికారిగానే గాక కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో పలు కీలక పదవులు అధిరోహించారు. వినోద్ రాయ్, శరద్ పవార్ లు బీసీసీఐ అధ్యక్షులుగా ఉన్న సమయంలో కార్యదర్శిగా పనిచేశారు. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) కు అధ్యక్షుడిగా సేవలందించారు.
ఐపీఎస్ అధికారిగా రిటైరయ్యాక ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీసీసీఐలో సెక్రటరీగా పనిచేస్తున్న క్రమంలో జార్ఖండ్ క్రికెట్ పురోగతి కోసం ఎంతో కృషి చేశారు. ఆయన సెక్రటరీగా ఉన్న సమయంలోనే జార్ఖండ్ కు ఫస్ట్ క్లాస్ క్రికెట్ హోదా దక్కింది. అప్పటివరకు బీహార్-జార్ఖండ్ కలిసే ఉండేవి.
కానీ 2000లలో బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది. దీంతో జార్ఖండ్ కొత్త క్రికెట్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. కానీ అది అంత ఈజీగా జరగలేదు. ఇందుకోసం అమితాబ్.. తీవ్రంగా శ్రమించారు. ఆయన కృషి వల్లే మహేంద్ర సింగ్ ధోని.. బీహార్ నుంచి జార్ఖండ్ కు మారి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. క్రికెట్ లోనే గాక అమితాబ్.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) కి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
రాంచీలో అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్మించడంలో కూడా చౌదరి కీలకంగా వ్యవహరించారు. ఆయన మృతిపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విటర్ వేదికగా నివాళి అర్పించారు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. చౌదరి కుటుంబానికి సంతాపం ప్రకటించాడు.
బీసీసీఐ కార్యదర్శిగానే గాక ఆయన అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా, పలు సందర్బాలలో జట్టు మేనేజర్ గా కూడా పనిచేశారు. 2005లో భారత జట్టు జింబాబ్వే టూర్ కు వెళ్లినప్పుడు జట్టుకు అమితాబ్ మేనేజర్ గా పనిచేశారు. ఆ సిరీస్ లోనే టీమిండియాకు అప్పుడు సారథిగా ఉన్న గంగూలీ, హెడ్ కోచ్ గ్రెగ్ ఛాపెల్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. గంగూలీని సారథిగా తప్పించాలని కోరుతూ ఛాపెల్.. శరద్ పవార్ కు లేఖ రాయడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో చౌదరి తన పదవి నుంచి తప్పుకున్నారు.
