Ricky Ponting: అడిలైడ్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఓటమి  అనంతరం ఇంగ్లాండ్ సారథి జో రూట్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఓటమికి బౌలర్లను నిందిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్  ఘాటుగా స్పందించాడు. 

యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మెడకు ఉచ్చులా బిగుస్తున్నది. అతడి సారథ్య సామర్థ్యానికి ఈ సిరీస్ పరీక్ష పెడుతున్నది. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఇంగ్లాండ్ తొలి రెండు టెస్టులు ఓడిపోయిన నేపథ్యంలో ఆ దేశానికి చెందిన క్రికెటర్లే కాదు.. ఆసీస్ మాజీ ఆటగాళ్లు కూడా రూట్ పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్.. రూట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో టెస్టు ఓటమికి బౌలర్లను నిందిస్తూ రూట్ చేసిన వ్యాఖ్యలపై పాంటింగ్ ఫైర్ అయ్యాడు. రెండో టెస్టులో ఓడిన తర్వాత రూట్ స్పందిస్తూ.. తమ బౌలర్ల ప్రదర్శనపై పెదవి విరిచాడు. వాళ్లు సరైన లెంగ్త్ లో బౌలింగ్ చేయలేకపోయారని వాపోయాడు. 

పాంటింగ్ మాట్లాడుతూ.. ‘అతడు అలా మాట్లాడటంతో నేను షాక్ కు గురయ్యాను. బౌలర్లు రాణించకుంటే, వాళ్లు నీ (కెప్టెన్) వ్యూహాలకు అనుగుణంగా బంతులు వేయకుంటే వారిని మార్చాల్సింది ఎవరు..? నువ్వు (రూట్) నాయకుడిగా ఉండి ఏం చేస్తున్నావ్..? బౌలర్లకు లెంగ్త్ గురించి సలహాలు, సూచనలు చేయలేవా.? నువ్వసలు మైదానంలో ఏం చేస్తున్నావ్..?’ అంటూ ఫైర్ అయ్యాడు. 

అంతేగాక.. ‘ఒకసారథిగా బౌలర్ల నుంచి నీకు ఎలాంటి ప్రదర్శన కావాలో నువ్వు వాళ్లకు చెప్పాలి. నువ్వు ఆశించినట్టుగా బౌలర్లు బంతులు వేయకుంటే వాళ్లను మార్చేయాలి. నీ వ్యూహాలకు తగ్గట్టుగా బౌలింగ్ చేసేవారినే బరిలోకి దించాలి. అవతలి వైపు బ్యాటింగ్ చేస్తున్న వాళ్లను ఔట్ చేయడానికి నువ్వు ఏం ప్రణాళికలు రచించావు.. అసలు వాళ్లు (బౌలర్లు) ఏమనుకుంటున్నారు..? అని నువ్వు తెలుసుకోవాలి కదా.. ముందుగా బౌలర్లతో ఓపెన్ గా మాట్లాడాలి. అది కదా నాయకత్వ లక్షణం అంటే....’ అంటూ విమర్శలు గుప్పించాడు. 

రూట్ కెప్టెన్సీ పై పాంటింగ్ ఒక్కడే కాదు.. ఇటీవల కాలంలో పలువురు మాజీలు కూడా ఇలాగే స్పందించారు. ఇయాన్ చాపెల్, న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్కల్లమ్ కూడా రూట్ సారథ్యంపై పెదవి విరిచారు. అతడిలో నాయకత్వ లక్షణాలే లేవని వ్యాఖ్యానించారు. మెక్కల్లమ్ అయితే.. రూట్ ఆటగాడిగా గొప్ప ప్లేయరే కావొచ్చు గానీ సారథిగా మాత్రం అట్టర్ ప్లాఫ్ అని కామెంట్స్ చేశాడు. 

కాగా.. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 275 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆసీస్ నిర్దేశించిన 468 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు.. 192 పరుగులకే చేతులెత్తేసింది. వికెట్ కీపర్ జోస్ బట్లర్ 207 బంతులాడి ఆ జట్టును ఓటమి నుంచి తప్పించాలని చూసినా హిట్ వికెట్ గా ఔటవ్వడంతో ఇంగ్లాండ్ కు భంగపాటు తప్పలేదు. ఇక గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా ఆసీస్ 9 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్ విజేతను తేల్చే కీలకమైన మూడో టెస్టు.. ఈనెల 26 నుంచి మెల్బోర్న్ వేదికగా మొదలుకానున్నది.