Shane Warne Funeral: ప్రపంచ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. అతడి కుటుంబసభ్యులు, అత్యంత ఆప్తులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈనెల 30 న మెల్బోర్న్ లో ప్రభుత్వం అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఈనెల 4న థాయ్లాండ్ లోని తన విల్లాలో అపస్మారక స్థితిలోకి వెళ్లి గుండెపోటుతో మరణించిన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. వార్న్ కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతించారు. మొత్తం 80 మంది సమక్షంలో వార్న్ ప్రైవేట్ ఫ్యునరల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈనెల 30న ప్రభుత్వ ఆధ్వర్యంలో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో సుమారు లక్ష మంది మధ్య వార్న్ అధికారిక అంత్యక్రియలు జరుగనున్నాయి.
ఇదిలాఉండగా కుటుంబసభ్యులు, అత్యంత ఆప్తుల మధ్య వార్న్ అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి వార్న్ తల్లిదండ్రులు కీత్, బ్రిగెట్ తో పాటు అతడి ముగ్గురు పిల్లలు హాజరయ్యారు. ఇక వార్న్ కు క్రికెట్ ఫీల్డ్ లో ఆప్తులైన గ్లెన్ మెక్‌గ్రాత్, మార్క్ వా, మైకేల్ క్లార్క్, మార్క్ టేలర్‌లతోపాటు మాజీ పేస్ బౌలర్ మెర్వ్ హ్యూస్, మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా వార్న్ కు తుది వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా వార్న్ తన జీవితాంతం ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్న సెయింట్ కిల్డా ఫుట్బాల్ క్లబ్ సభ్యులంతా ఆ క్లబ్ కు సంబంధించిన స్కార్ఫ్ లతో కనిపించారు. రెండు స్కార్ఫ్ లను వార్న్ మృతదేహం నిల్వపరిచిన శవపేటిక మీద ఉంచారు.
ఇక 30 న మెల్బోర్న్ లో నిర్వహించనున్న ప్రభుత్వ అధికార అంత్యక్రియలకు ప్రముఖ క్రికెటర్లు తరలిరానున్నారు. ఆస్ట్రేలియాకే గాక ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు, వార్న్ తో అనుబంధమున్న ఆటగాళ్లు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశముంది. వార్న్ అంత్యక్రియల కోసమే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ కు వారం రోజుల పాటు ఆలస్యంగా రానున్నాడు. ఇక ప్రముఖ పాప్ గాయకుడు ఎడ్ షీరన్, క్రిస్ మార్టిన్ లు ఈ కార్యక్రమంలో వార్న్ కోసం ప్రత్యేక గీతాలు ఆలపించనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ గ్రౌండ్ లోని సదరన్ స్టాండ్ కు షేన్ వార్న్ పేరు పెట్టనున్నారనే విషయం తెలిసిందే.
తన పదిహేనేళ్ల కెరీర్ లో వార్న్ అంతర్జాతీయ కెరీర్ లో వెయ్యికి పైగా వికెట్లు తీసుకున్నాడు. టెస్టులలో 708 వికెట్లు తీయగా వన్డేలలో 293 వికెట్లు పడగొట్టాడు.
