సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ భార్యతో విడాకులు తీసుకోనున్నాడు. తాము త్వరలోనే విడాకులు తీసుకుంటున్నట్లు క్లార్క్, ఆయన భార్య కైలీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొంత కాలం ఇద్దరం విడివిడిగా జీవించిన తర్వాత స్నేహపూర్వకంగా విడిపోవాలని అనుకున్నామని, ఆ ఉద్దేశంతో ఈ కష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నామని వారు చెప్పారు. 

2012లో క్లార్క్ మాజీ మోడల్, టీవీ ప్రెజెంటర్ కైలీని వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కూతరు కెల్సే ఉంది. పరస్పరం గౌరవించుకుంటూ తమ కూతురిని ఇద్దరం చూసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా వారు కోరారు. క్లార్క్, కైలీ కోర్టు వెలువలే తమ విడాకుల ప్రక్రియను ముగించాలని భావిస్తున్నట్లు సమాచారం. 

క్లార్క్ దంపతులు విడిపోయారని ఐదు నెలల క్రితం ప్రచారం సాగింది. అయితే కైలీ ఆ వార్తలను ఖండించారుు. తమ బంధం బలంగా ఉందని చెప్పారు. కైలీతో వివాహానికి ముందు క్లార్క్ కు మోడల్ లారా బింగిల్ తో నిశ్చితార్థం జరిగింది. కానీ వారిద్దరు విడిపోయారు. ఆ తర్వాత బింగిల్ నటుడు, అవతార్ హీరో సామ్ వర్తింగ్టన్ ను 2014లో వివాహం చేసుకుంది. 

2011లో రికీ పాంటింగ్ నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ముందుకు నడిపించడంలో విజయం సాధించాడు. తన 12 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో 115 టెస్టులు, 245 వన్డేలు, 34 టీ20 మ్యాచులు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.