Fans Pays Tribute To Shane Warne: ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వ్యసనాలకు అలవాటై కెరీర్ లో  వివాదాలకు కేంద్ర బింధువైన విషయం తెలిసిందే. గతంలో అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు కూడా వాడాడు. 

ఎవరైనా చనిపోతే వాళ్లకు నివాళి అర్పించేప్పుడు పువ్వులు, పువ్వులతో తయారుచేసిన దండలు వారి పార్థీవ దేహం ముందుంచడం ఆనవాయితీ. కానీ ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అభిమానులు మాత్రం అలా కాదు.. వాళ్ల రూటే సెపరేటు. తమ అభిమాన క్రికెటర్ కు నివాళిని గడించేందుకు గాను వాళ్లు.. బీర్లు, సిగరెట్లు, మాంసం ముక్కలను తీసుకొస్తున్నారు. షేన్ వార్న్ విగ్రహం ముందు ఉంచి నివాళి అర్పిస్తున్నారు. 

శుక్రవారం థాయ్లాండ్ లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో షేన్ వార్న్ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ముందు ఏర్పాటు చేసిన షేన్ వార్న్ కాంస్య విగ్రహం దగ్గర తమదైన శైలిలో నివాళి అర్పిస్తున్నారు. 

తప్పో.. ఒప్పో.. తనకు నచ్చినట్టు జీవించిన వార్న్ కు సిగరెట్లు, బీర్లు అంటే ఇష్టం. పలు సందర్బాల్లో వీటిని సేవిస్తూ అతడు ఫోటోలకు ఫోజులిచ్చిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యసనాల కారణంగానే అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు కూడా వాడి వివాదాల్లో చిక్కుకున్నాడు.

Scroll to load tweet…

వార్న్ మరణించాడన్న వార్త తెలియగానే శనివారం అతడి కాంస్య విగ్రహం వద్దకు చేరుకున్న అభిమానులు.. తమ అభిమాన ఆటగాడికి నచ్చిన సిగరెట్లు, బీర్లు, మాంసాన్ని అక్కడ ఉంచుతున్నారు. ఈ సందర్భంగా పలువురు వార్న్ అభిమానులు మాట్లాడుతూ.. ‘నాకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. కానీ ఇంతకుముందు అతడిని ఒకసారి కలిశాను. నా వయస్సు కన్నా అతడు పెద్దవాడేమీ కాదు. ఇలా జరగడం దురదృష్టకరం..’ అని అన్నాడు.

Scroll to load tweet…

మరో అభిమాని మాట్లాడుతూ.. ‘వార్న్ నా చిన్ననాటి హీరో. వార్న్ మరణాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదు. అతడు నావంటి ఎంతో మందికి ఆరాధ్య దైవం. వార్న్ రిటైరై చాలా కాలం గడుస్తున్నా ఇప్పటికీ అతడి బౌలింగ్ వీడియోలు చూస్తే వచ్చే కిక్కే వేరు.’ అని అన్నాడు. వార్న్ విగ్రహం వద్దకు వచ్చిన మరో అభిమాని.. ‘బాల్ ఆఫ్ ది సెంచరీ విసిరిన గొప్ప స్పిన్నర్ అతడు. ఆ డెలివరీ ఎంతో ప్రత్యేకం. ఆ బాల్ ను చూసే అవకాశం రావడం మా అదృష్టం...’ అని అన్నాడు.

తన కెరీర్ లో 145 టెస్టులు ఆడిన వార్న్.. 708 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు) తర్వాత స్థానం వార్న్ దే.. టెస్టులలో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు పది వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తరఫున వన్డేలలో 194 మ్యాచులు ఆడి 293 వికెట్లు పడగొట్టాడు.