RCB vs SRH Live Updates: అదే నిర్లక్ష్యం.. అదే ఆటతీరు.. వరుసగా  విఫలమవుతున్నా.. సర్వత్రా విమర్శలు వస్తున్నా అతడు మారలేదు. అతడి ఆటా మారలేదు. ఒకప్పుడు మకుటం లేని మహారాజు విరాట్ కోహ్లి కథ ఇక కంచికేనా..? 

మూడు రోజుల క్రితం లక్నో సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సందర్బంగా కోహ్లి బ్యాటింగ్ కు వచ్చి డకౌటయ్యాడు. అప్పుడు అతడి ముఖంలో ఒకరకమైన నవ్వు. అది ఓటమితో కాదు. నిస్సహాయత. ఏమీ చేయలేని అసహనం. అంతకుమించిన నిర్వేదం. కట్ చేస్తే.. శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్.. డుప్లెసిస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు విరాట్. తొలి బంతికే డకౌట్. ఈసారి కూడా కోహ్లి నవ్వాడు. కానీ దించిన తల ఎత్తలేదు. అదే నిస్సహాయత. అదే నిర్వేదం.. నేనింతేనా..? అన్న భావన కోహ్లి ముఖంలో స్పష్టంగా కనిపించింది. తన కెరీర్ లో అత్యంత అద్వాన్న దశలో ఎదుర్కుంటున్న పరుగుల యంత్రం విరాట్ కోహ్లి కథ కంచికేనా..? గత కొంతకాలంగా అతడి ఫామ్ చూస్తే అంతకు మించి ఏం చెప్పినా అది అతిశయెక్తే..

తన ఐపీఎల్ కెరీర్ లో మునుపెన్నడూ లేనంతగా వరుసగా రెండు సార్లు డకౌటయ్యాడు విరాట్. ఇదివరకెప్పుడూ కూడా ఇలా జరుగలేదు. ఇదో చెత్త రికార్డు. అసలే రెండున్నరేండ్ల నుంచి సెంచరీ లేక తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ లో అయినా కాస్త కుదురుకుంటాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగుల్చుతున్నాడు. 

ఒకప్పుడు ఐపీఎల్ అంటే విరాట్ కోహ్లి.. కోహ్లి అంటే ఐపీఎల్. అలా సాగేది అతడి విధ్వంసం. కానీ ఇప్పుడు విధ్వంసాలు, వీరత్వాలు పక్కనబెడితే కనీసం క్రీజులో నిలిచినా చాలు దేవుడా.. అని అతడి అభిమానులు ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నారు. కోహ్లి అభిమానులే కాదు.. తాను ఏం చేయలేకపోతున్నానే అనే భావన కోహ్లి ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ సీజన్ లో కోహ్లి ఇప్పటివరకు 8 మ్యాచులాడాడు. వాటిలో స్కోర్లు వరుసగా.. 41 నాటౌట్, 12, 5, 48, 1, 12, 0, 0 గా ఉన్నాయి.

Scroll to load tweet…

కెప్టెన్సీ కోల్పోయి (టీ20లో తానే వైదొలిగాడు. వన్డేలో బీసీసీఐ తొలిగించింది. టెస్టులలో దిగిపోవాల్సి వచ్చింది)న కోహ్లి.. ఏడేండ్లు తాను అప్రతీహాతంగా పాలించిన రాజ్యాన్ని రోహిత్ శర్మకు అప్పగించాడు. ఇప్పుడు అతడు కూడా వైదొలుగుతాడా..? అన్నట్టు కోహ్లి ప్రదర్శనలున్నాయి. 

సన్ రైజర్స్ బౌలర్ల హవా.. 

ఇక ఐపీఎల్-15లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు దుమ్ము దులుపుతున్నారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా యువ సంచలనం మార్కో జాన్సేన్.. ఒకే ఓవర్లో ముగ్గురు టాప్ బ్యాటర్లను పెవలియన్ కు పంపాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జాన్సేన్.. రెండో బంతికి డుప్లెసిస్ ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికే కోహ్లి.. స్లిప్స్ లో మార్క్రమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్లో ఆరో బంతికి అనూజ్ రావత్.. స్లిప్స్ లో మార్క్రమ్ కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

మ్యాక్స్వెల్ (12), ప్రభుదేశాయ్ (15), షాబాజ్ (7), హర్షల్ పటేల (4), దినేశ్ కార్తీక్ (0) లు దారుణంగా విఫలమయ్యారు. 14 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ.. 58 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఆ జట్టు 80 పరుగులు కూడా చేసినా గొప్పే.