క్రికెట్ ను ఓ ఆటగా  మాత్రమే  చూస్తే వచ్చే నష్టమే  లేదు. కానీ  అభిమానం మితిమీరినప్పుడే అసలు సమస్య. తాజాగా   ఒడిషాలో కూడా  ఇద్దరు అభిమానుల మధ్య జరిగిన ఓ గొడవ.. ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.  

భారత్ లో క్రికెట్ ను ఓ మతం కంటే ఎక్కువగా ఆరాధించే అభిమానులున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తో పాటు ఐపీఎల్ లో తమ అభిమాన టీమ్ ఓడిపోతే అభిమానులు స్పందన పీక్స్ కు వెళ్తుంది. ఆటగాళ్ల ఇళ్లను ధ్వంసం చేయడం, వారి దిష్టిబొమ్మలను కాల్చడం వంటివి సర్వసాధారణం. క్రికెట్ ను ఓ ఆటగా మాత్రమే చూస్తే వచ్చే నష్టమే లేదు. కానీ అభిమానం మితిమీరినప్పుడే అసలు సమస్య. తాజాగా ఒడిషాలో కూడా ఇద్దరు అభిమానుల మధ్య జరిగిన ఓ గొడవ.. ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవ జరిగినందుకు కారణమైన విషయం కూడా చాలా సిల్లీగా ఉంది.

ఒడిషా లోని చౌడ్వార్ లో గల మహిసలంద్ వేదికగా జరిగిన ఓ అండర్ - 18 క్రికెట్ జట్టులో బౌలర్ ఒకరు నో బాల్ వేసినందుకు గాను ఇరు జట్ల అభిమానుల మధ్య గొడవ తలెత్తి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే దశకు వెళ్లింది. 

వివరాల్లోకెళ్తే.. మహిసలందర్ వేదికగా ఆదివారం శంకర్పూర్ - బెర్హమ్పూర్ మధ్య అండర్ -18 క్రికెట్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ చూడటానికి లక్కీ రౌత్ (22), జగా రౌత్ లు వచ్చారు. ఈ ఇద్దరూ వేర్వేరు గ్రామాలకు చెందిన వ్యక్తులు. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో బౌలర్ ఒకరు నోబాల్ వేశాడు. దీంతో లక్కీ, జగాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది నో బాల్ కాదని ఒకరు నో బాలేనని మరొకరు తీవ్రంగా గొడవపడ్డారు. వాగ్వాదం కాస్త ముదిరి కొట్టుకునేదాకా వెళ్లింది. 

జగా.. తన దగ్గర ఉన్న బ్యాట్ తో లక్కీపై దాడికి దిగాడు. అంతేగాక ఊళ్లో ఉంటున్న తన సోదరుడు మునాకు ఫోన్ చేసి స్టేడియానికి పిలిపించాడు. అప్పటికే బ్యాట్ తో దాడి చేయడంతో అపస్మారక స్థితిలో ఉన్న జగా ను మునా తన వెంట తెచ్చుుకున్న కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి అన్నాదమ్ములిద్దరూ తప్పించుకుని పారిపోయారు.

రక్తపుమడుగులో ఉన్న జగాను దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మునా పై మర్డర్ కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.