డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 2-0 తేడాతో ఓడిన మొరాకో...  ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌లో అర్జెంటీనాతో తలబడబోతున్న ఫ్రాన్స్... 

ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీ ఫైనల్ చేరిన మొరాకో, ఫైనల్ మాత్రం చేరలేకపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో ఫిఫా వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో అడుగుపెట్టిన ఫ్రాన్స్‌, సెమీస్‌లో మొరాకోని చిత్తు చేసి ఫైనల్ చేరింది...

ఆట ఆరంభం నుంచి తీవ్రమైన ప్రెషర్‌కి లోనైన మొరాకో ఆటగాళ్లు, ఫ్రాన్స్ దూకుడు ముందు నిలవలేకపోయారు. ఆట 5వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు తివో హర్నాందేజ్ గోల్ చేసి 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత ఆట 79వ నిమిషంలో రండల్ కొలో మువానీ గోల్‌తో ఫ్రాన్స్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది...

ఈ ఆధిక్యాన్ని చివరి నిమిషం వరకూ కాపాడుకున్న ఫ్రాన్స్, 2-0 తేడాతో మ్యాచ్‌ని సొంతం చేసుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో అడుగుపెట్టిన మొరాకో... బెల్జియంకి షాక్ ఇచ్చి ప్రీక్వార్టర్స్‌కి చేరింది...

ఆ తర్వాత ప్రీక్వార్టర్స్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటైన స్పెయిన్‌కి కూడా 3-0 తేడాతో ఊహించని షాక్ ఇచ్చింది మొరాకో. క్వార్టర్ ఫైనల్స్‌లో పోర్చుగల్‌ని ఓడించి సంచలన విజయాలతో సెమీ ఫైనల్ చేరింది...

మొరాకో తొలిసారి సెమీ ఫైనల్ చేరడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. వేల సంఖ్యలో అభిమానులు, తమదేశానికి సపోర్ట్ చేసేందుకు ఖతర్ చేరుకున్నారు. ఒక్కసారిగా తమపై ఇన్ని అంచనాలు పెరిగిపోవడంతో మొరాకో జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. సెమీ ఫైనల్‌లో చిత్తుగా ఓడింది...

మొరాకో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన అభిమానులు, బెల్జియం రాజధాని బ్రస్సెల్‌లో విధ్వంసం సృష్టించారు. గ్రూప్ స్టేజీలో బెల్జియంని ఓడించి ప్రీక్వార్టర్స్ చేరింది మొరాకో. ఈ సమయంలో బ్రెల్జియం రాజధాని బ్రస్సెల్‌లో అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి...

తాజాగా సెమీస్‌లో మొరాకో ఓటమితో కొందరు బెల్జియం అభిమానులు, బ్రస్సెల్‌లో సంబరాలు చేసుకున్నారు. ఈ సంఘటనతో తీవ్ర ఆవేశానికి లోనైన మొరాకో అభిమానులు.. అల్లర్లు సృష్టించారు. దీంతో అల్లరి మూకలను అదుపు చేసుకుని పోలీసులు రంగంలోకి దిగి, టియర్ గ్యాస్‌ని ప్రయోగించాల్సి వచ్చింది.