ప్రస్తుతం అమలవుతున్న ఐపీఎల్ వేలంపాట పద్దతిపై క్రికెటర్ ఉతప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వేలం పాటకు వెళ్లిన సమయంలో తాము పశువుల్లా భావిస్తామని అన్నారు. క్రికెటర్లకు గౌరవపదంగా ఉండే కొత్త పద్దతి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలంపాట విధానంపై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) క్రికెటర్ రాబిన్ ఉతప్ప (robin uthappa) సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలం పాటకు వెళ్లిన సమయంలో తాను పుశువులా ఫీల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న ఈ వేలంపాట పద్దతి కంటే మెరుగైన పద్దతి రావాలని ఆకాంక్షించారు.
ఇటీవల బెంగళూరు (bangalore)లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో CSK రూ. 2 కోట్ల ధర చెల్లించి కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ వేలంలోకి వెళ్లిన సమయంలో తనకు తాను పశువులాగా అనిపించిందని తెలిపారు. ఇది పరీక్ష తర్వాత ఫలితాల కోసం వేచి ఉండటంతో పొల్చాడు. ఆటగాళ్లను కొనుగోలు చేసే సాధారణ పద్ధతికి బదులుగా డ్రాఫ్ట్ సిస్టమ్ రావాలని వాదించాడు.
న్యూస్ 9 లైవ్ కు తాజాగా రాబిన్ ఉతప్ప ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వేలం పాట అనేది ఎలా ఉంటుందంటే మీరు చాలా కాలం క్రితం పరీక్ష రాసి.. ఇప్పుడు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు పశువుల (సరుకు) లాగా భావిస్తారు.’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆటగాళ్ల మానసిక క్షేమానికి వేలం విధానం ఖచ్చితంగా శ్రేయస్కరం కాదని ఆయన అంగీకరించాడు.
‘‘ CSK వంటి జట్టు కోసం ఆడాలని నేను బలంగా కోరుకున్నాను. దీని కోసం నేను ప్రార్థించాను. నా కుటుంబం, నా కొడుకు కూడా దీని కోసం ప్రార్థించారు. ఇది నాకు ప్రత్యేకమైనది. నేను తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. భద్రతా భావం, గౌరవం ఉన్న ప్రదేశంలో నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం ఉంది ’’ అని ఉతప్ప చెప్పారు.
‘‘ వేలంలో అమ్ముడు పోని కుర్రాళ్ళు ఏమి చేస్తారో మీరు ఊహించలేరు. వారికి మనఃశాంతిగా ఉండదు. చాలా కాలం నుండి అక్కడ ఉండి ఎంపిక కాని కుర్రాళ్ల పరిస్థితి తలచుకుంటే నా హృదయం ఉప్పొంగుతుంది. అకస్మాత్తుగా కొన్ని సార్లు మీపై ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయంపై ఓ క్రికెటర్ విలువ ఆధారపడి ఉంటుంది. ఇది చాలా అస్తవ్యస్థమైన పద్దతి. దీని కంటే మెరగైన పద్దతి, క్రికెటర్లను గౌరవపదంగా చూసే పద్దతి రావాలని నేను భావిస్తున్నాను ’’ అని ఉతప్ప తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉతప్ప భారతదేశం తరపున 46 ODIలు ,13 T20Iలు ఆడారు. గత సీజన్‌లో CSK తో IPL విజేతగా నిలిచారు.
