ENG vs NZ: ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి  జో రూట్ తో పాటు ఓలీ పోప్ లు శతకాలతో కదం తొక్కారు.  అయితే వీరి విన్యాసాలకు వాళ్ల తండ్రులు ముగ్దులైపోయారు. 

‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుకొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతీ...!’ అన్నాడు సుమతీ శతకంలో బద్దెన (?). పుత్రోత్సాహం పుత్రుడు జన్మించినప్పుడు కాదు ఆ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు వస్తుందని దాని తాత్పర్యం. తమ కుమారులు ఎంచుకున్న రంగాలలో విజయవంతమవుతుంటే.. అది తండ్రులు కళ్లారా చూసినప్పుడు వారికి పుత్రోత్సాహమే కదా. ప్రస్తుతం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్, ఓలీ పోప్ ల తండ్రులు ఇంచుమించు ఇదే భావనలో ఉన్నారు.

ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జో రూట్, ఓలీ పోప్ లు సెంచరీలతో కదం తొక్కారు. అయితే స్టాండ్స్ లో ప్రేక్షకుల మధ్య కూర్చుని మ్యాచ్ చూస్తున్న జో రూట్, పోప్ తండ్రులు వారి కొడుకుల శతకాలు చూసి మురిసిపోయారు. 

పక్కపక్కనే కూర్చున్న ఈ ఇద్దరు తండ్రులు.. తమ కొడుకులు సెంచరీలు చేసినతర్వాత ఒకరిని ఒకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇంగ్లాండ్ బర్మీ ఆర్మీ ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. రూట్ సెంచరీ మార్కు చేరుకోగానే అతడి తండ్రిని పోప్ నాన్న హత్తుకున్నాడు. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 

Scroll to load tweet…

కాగా ఇంగ్లాండ్-కివీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసిన న్యూజిలాండ్ కు ఆతిథ్య జట్టు దీటుగా బదులిస్తున్నది. కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 553 పరుగులకు ఆలౌట్ అవగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్ లో 114 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓలీ పోప్ (145), జో రూట్ (163 నాటౌట్) లు రాణించారు. ప్రస్తుతం రూట్ తో పాటు బెన్ ఫోక్స్ (24 నాటౌట్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. 

Scroll to load tweet…