Asianet News TeluguAsianet News Telugu

ధోనీని చూడడం కోసం తెల్లవారుజాము దాకా స్టేడియంలోనే ఫ్యాన్స్... మోకాలి నొప్పితోనే మాహీ...

ధోనీని చూసేందుకు అర్ధరాత్రి దాటినా స్టేడియంలోనే ఓపిగ్గా ఎదురుచూసిన అభిమానులు... ఫ్యాన్స్ కోసం స్టేడియంలోకి వచ్చిన మాహీ... 

fans waits to see MS Dhoni, after final match CSK Captain alone walks into Stadium for fans CRA
Author
First Published Jun 1, 2023, 10:37 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ప్రతీ మ్యాచ్ హౌస్ ఫుల్ అయ్యింది. సీఎస్‌కే ఎక్కడ మ్యాచులు ఆడిన ధోనీ అభిమానులతో స్టేడియమంతా పసుపు వర్ణంతో నిండిపోయింది...  ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడడంతో తొక్కిసలాట కూడా జరిగి, చాలామంది అభిమానులు గాయపడ్డారు.

వర్షం కారణంగా మే 28న జరగాల్సిన మ్యాచ్, మే 29కి వాయిదా పడినా... వేల సంఖ్యలో అభిమానులు.. స్టేడియం చుట్టుపక్కల రోడ్ల మీద పడుకుని, ఫైనల్ మ్యాచ్‌ చూసేందుకు ఎదురుచూశారు...

మే 29న కూడా వర్షం కురిసి మ్యాచ్ ఫలితం తేలేందుకు అర్ధరాత్రి దాటినా స్టేడియంలోనే ఓపిగ్గా ఎదురుచూసిన అభిమానులు... చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్నారు. మాహీని చూసేందుకు మంగళవారం తెల్లవారుజాము దాకా స్టేడియంలోనే ఎదురుచూశారు అభిమానులు...

ఈ విషయం తెలుసుకున్న మాహీ, మోకాలి నొప్పిని కూడా లెక్కచేయకుండా స్టేడియంలోకి వెళ్లి... అంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. అప్పటికి సమయం ఉదయం 3 గంటల 30 నిమిషాలు...

వచ్చే నెల 7వ తేదీన మహీ 42వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. వచ్చే సీజన్‌లో ఆడతానో లేదో స్పష్టంగా చెప్పలేనని కామెంట్ చేసిన ధోనీ, దాదాపు వచ్చే ఏడాది ఆడడం అనుమానమే. అయితే మోకాలి గాయం నుంచి త్వరగా కోలుకుంటే మాహీ మరో సీజన్ ఆడే అవకాశం ఉంది.. 

అంతర్జాతీయ క్రికెట్‌ని గోల్డెన్ డక్‌తో ప్రారంభించిన మహేంద్ర సింగ్ ధోనీ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. మాహీకి ఇదే ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ అయితే సున్నాతో మొదలైన మాహీ కెరీర్, మళ్లీ డకౌట్‌తోనే ముగిసినట్టు అవుతుంది...

మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో రనౌట్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ, తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ వన్డే వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్‌లో కూడా రనౌట్‌గా పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే...

‘నేనైతే ఇంకో సీజన్ ఆడాలనే అనుకుంటున్నా. అయితే దానికి ఇంకా చాలా సమయం ఉంది. అప్పటికి నా ఫిట్‌నెస్‌, నా శరీరం ఎలా సహకరిస్తుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఇప్పుడే దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు...’ అంటూ వ్యాఖ్యానించాడు మహేంద్ర సింగ్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి, సెడన్ షాక్ ఇచ్చిన మాహీ... ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఇలాంటి ప్రకటనే చేస్తాడని చాలా మంది భావిస్తున్నారు...

రిటైర్మెంట్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కి బ్యాటింగ్ కోచ్‌గా లేదా మెంటర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టీమ్‌లో ఉన్నా లేకపోయినా సీఎస్‌కేకి అన్ని రకాలుగా సహకరిస్తూనే ఉంటానని ధోనీ చేసిన కామెంట్లే దీనికి నిదర్శనం.. 

Follow Us:
Download App:
  • android
  • ios