Asianet News TeluguAsianet News Telugu

మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ ట్వీట్.. వాళ్లకేదైనా అంసతృప్తి ఉందంటే అది నువ్వే అంటూ దాదాపై నెటిజన్ల ఆగ్రహం

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా భారత మహిళల క్రికెట్ జట్టుపై చేసిన ఓ ట్వీట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.  అమ్మాయిల ప్రదర్శనకు గర్వపడాల్సిందిపోయి ఇదేం హేళన..? అంటూ నెటిజనులు మండిపడుతున్నారు. 

Fans Furious Over BCCI president Sourav Ganguly Tweet on Indian Women Cricket Team
Author
First Published Aug 10, 2022, 10:40 AM IST

కామన్వెల్త్ క్రీడలలో భాగంగా ఇటీవలే ముగిసిన క్రికెట్ ఫైనల్స్ లో ఇండియా-ఆస్ట్రేలియా తలపడగా భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో కంగారూల చేతిలో ఓడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత జట్టు పోరాడి ఓడింది. అయితే  జట్టు ఓడినా తొలి ప్రయత్నంలోనే గెలిచినంత పనిచేసింది హర్మన్‌ప్రీత్ కౌర్ సేన. టీమిండియాపై  సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోడీలు  ప్రశంసలు కురిపిస్తుండగా బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉన్న  సౌరవ్ గంగూలీ మాత్రం  అందుకు విరుద్ధకరమైన రీతిలో ట్వీట్ చేశాడు. అధ్యక్ష పదవిలో ఉండి ఇవేం వ్యాఖ్యలంటూ మండిపడుతున్నారు. 

గంగూలీ ట్వీట్ చేస్తూ.. ‘రజతం గెలిచినందుకు భారత మహిళల జట్టుకు అభినందనలు. అయితే వాళ్లు మాత్రం తమ ఆటతీరుతో నిరాశగా ఇంటికి తిరిగివస్తారు..’ అని  ట్వీటాడు. గెలవాల్సిన మ్యాచ్ ను ఓడినందుకు గాను వాళ్లలో అసంతృప్తి గూడు కట్టుకుని ఉందని  అర్థం వచ్చేలా  గంగూలీ చేసిన ట్వీట్ పై అభిమానులు మండిపడుతున్నారు.  

 

దాదా చేసిన ఈ ట్వీట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘వాళ్లేం నిరాశ చెందరు. రజతం సాధించినందుకు వాళ్లను చూసి మేం గర్విస్తున్నాం. కానీ  వాళ్లు నిరాశ చెందుతారు.. ఎందుకో తెలుసా..? వాళ్లకింకా సరైన విధానమంటూ (బీసీసీఐ మహిళల క్రికెట్‌ను ఉద్దేశిస్తూ) ఏర్పాటు చేయనందుకు...’, ‘తొలి ప్రయత్నంలో  అద్భుతంగా పోరాడి  స్వర్ణం గెలిచినంత పనిచేశారు. అందుకు వాళ్లను అభినందించాల్సింది పోయి ఇవేం పనికిమాలిన ట్వీట్లు..? సచిన్ ను చూసి నేర్చుకో..’, ‘అవును వాళ్లు నిరాశగానే వెనుదిరుగుతారు. కానీ మ్యాచ్ ఓడినందుకు కాదు.  నీలాంటి వ్యక్తి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నందుకు.. వాళ్లకు ఏదైనా అసంతృప్తి ఉందంటే అది నువ్వే..’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

 

 

ఇక స్వర్ణం కోసం జరిగిన పోరులో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేయగా.. భారత జట్టు 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది.  ఛేదనలో భారత్ ముందు బాగానే ఆడినా  తర్వాత తడబడింది.   వరుసగా వికెట్లు కోల్పోయి విజయాన్ని దూరం చేసుకుని రజతంతో సరిపెట్టుకుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios