తాము అభిమానించేవారిపై ప్రేమాభిమానాలు చూపెట్టడం సర్వసాధారణమైన విషయం. ఇక క్రికెటర్లపై అభిమానాన్ని అభిమానులు నెక్స్ట్ లెవెల్ లో చూపెట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఉదాహరణకు సుధీర్ కుమార్ చౌదరి అంటే ఎవరు గుర్తుపట్టక పోవచ్చు...కానీ ప్రతి భారత మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ అనే పేరును వంటి మీద రాసుకుని భారత జాతీయ పతాక రంగులను ఒంటికి పులుముకొనే అభిమాని అంటే అందరూ గుర్తుపడతారు. 

ఇలానే ప్రస్తుత టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫాన్స్ కొదవలేరు. అమితమైన అభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. తాజాగా ఒక అభిమాని విరాట్ కోహ్లీ పై చూపెట్టిన టాటూ అభిమానానికి ఫిదా అయ్యాడు. 

ఈ అభిమాని తనపై చూపిన ప్రేమకు విరాట్‌ కోహ్లి షాక్‌ గురయ్యారు. ఒడిశాకు చెందిన పింటు బెహరా అనే ఓ అభిమాని విరాట్‌ను ప్రాక్టీస్‌ సమయంలో కలిసాడు. అయితే రెగ్యులర్‌ అభిమానిగానే ట్రీట్‌ చేస్తున్న సమయంలో చొక్కా విప్పి తన ఒంటిపై ఉన్న ట్యాటూలను కోహ్లికి చూపించాడు. 

Also read: భుజం తట్టి... మరాఠీలో హ్యాట్సాఫ్ చెప్పి...: కోహ్లీ ప్రశంసలు

దీంతో కోహ్లి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఒంటి నిండా కోహ్లికి సంబంధించిన మొత్తం 16 ట్యాటూలు ఉన్నాయి. ఇందులో కోహ్లి జెర్సీ నంబర్‌ 18 కూడా ఉండటం విశేషం. 

ఇక ఈ ట్యాటూలపై పింటు బెహరా స్పందిస్తూ.. 'నేను క్రికెట్‌ ప్రేమికుడిని. విరాట్‌ కోహ్లి అంటే పిచ్చి అభిమానం. ఆటపై అతడికున్న నిబద్ధత, బ్యాటింగ్‌ శైలితో నా మనసు గెలుచుకున్నాడు. అయితే అతడిపై నాకున్న అభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని 2016లో భావించాను. ఈ క్రమంలోనే ఒంటినిండా ట్యూటూలు వేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. దీనికోసం పైసా పైసా పోగుచేసి రూ.లక్ష జమచేసి ఈ ట్యాటూలు వేయించుకున్నాను. స్వదేశంలో కోహ్లి ఆడే ప్రతి మ్యాచ్‌కు నేను తప్పకుండా వెళ్తాను' అని అన్నారు.