టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థకు పాక్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిది ఒకప్పుడు భారీ విరాళం ప్రకటించాడు. ఈ విషయాన్ని పాక్ జర్నలిస్ట్ సజ్ సాదిక్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

కోవిడ్ 19 నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్‌లోని నిరుపేదలకు అఫ్రిది సాయం చేశాడు. ప్రస్తుత విపత్కర పరిస్ధితుల్లో అతను చేస్తున్న మంచి పనిని టీమిండియా మాజీ  క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్  సింగ్ ప్రశంసించారు.

అయితే భారత్, పాకిస్తాన్‌ల మధ్య వున్న వైరం నేపథ్యంలో వీరిద్దరిని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించిన యువరాజ్ సింగ్, హర్భజన్‌లు వారికి గట్టి బదులిచ్చారు.

ఇటువంటి విపత్కర పరిస్ధితుల్లో మతం, రాజకీయాల కన్నా మానవత్వమే ముఖ్యమని తేల్చిచెప్పారు. ఈ సమయంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

అఫ్రిది కెనడాలో ఉన్నప్పుడు యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు పదివేల డాలర్ల విరాళం ప్రకటించానని, అప్పుడు తన దేశంలోని ప్రతి ఒక్కరూ తనను అభినందించారని అఫ్రిది చెప్పాడు. అదే సమయంలో భారత్‌కు ఎందుకు సహాయం చేస్తున్నావని ఆ సమయంలో తనను ఎవ్వరూ ప్రశ్నించలేదని అఫ్రిది తనకు చెప్పినట్లు జర్నలిస్ట్ సాదిక్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.