Heath Davis discloses He is a Gay: న్యూజిలాండ్ మాజీ పేసర్ హీత్ డెవిస్ సంచలన ప్రకటన చేశాడు. తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 

కివీస్ మాజీ క్రికెటర్ హీత్ డెవిస్ సంచలన ప్రకటన చేశాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇన్నాళ్లు తాను ‘రహస్యంగా దాచిన’ ఓ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. తాను స్వలింగ సంపర్కుడినని, ఆ విషయం తనతో ఉన్నవాళ్లందరికీ తెలుసునని తెలిపాడు. దీని గురించి బయట ప్రపంచానికి చెప్పడానికి చాలా కాలం పాటు తనలో తానే కుమిలిపోయాయనని, అయితే ఇక దాచాల్సిన అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అతడు ఓ ఆన్లైన్ మ్యాగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

డెవిస్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఈ విషయం గురించి దాచిపెడుతున్నాననే భావన నన్ను వెంటాడేది. వాస్తవానికి ఇది నా పర్సనల్. అయినా దీనిని గోప్యంగా ఉంచాలని అనిపించలేదు. బయటి ప్రపంచానికి కూడా చెప్పాలనుకున్నా. నేను గే. ఆక్లాండ్ లో జట్టులోని ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు... 

అయినా వాళ్లు నన్ను నాలా ఉండనిస్తారు. నా స్వేచ్ఛకు భంగం కలిగించరు. అసలు దీనిని వాళ్లు ఒక సమస్యగా భావించలేదు..’అని కామెంట్ చేశాడు..’ అని వ్యాఖ్యానించాడు. 

అంతర్జాతీయ క్రికెట్ లో తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మహిళా క్రికెట్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఆసీస్ క్రికెటర్ అలెక్స్ బ్లాక్వెల్, ఇంగ్లాండ్ కు చెందిన లిన్సే అక్క్యూ, న్యూజిలాండ్ కు చెందిన అమీ సాటర్త్వైట్-లియా టహుహు, సౌతాఫ్రికాకు చెందిన డేన్ వాన్ నీకెర్క్-మరిజెన్ కాప్, మేఘనా షట్-జెస్ హోల్యాల్క్ (ఆసీస్), ఇంగ్లాండ్ కు చెందిన నటాలీ సీవర్-కాథరీన్ బ్రంట్ లు తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించడమే గాక పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే పురుషుల క్రికెట్ లో మాత్రం ఇంగ్లాండ్ కు చెందిన స్టీవెన్ డేవిస్ ఒక్కడే తాను గే అని ప్రకటించాడు. 2011 లో అతడు ఈ ప్రకటన చేశాడు. ఇక ఆ తర్వాత మరే క్రికెటర్ కూడా ఈ విధమైన ప్రకటన చేయలేదు. ఈ జాబితాలో హీత్ రెండో క్రికెటర్. న్యూజిలాండ్ వరకు చూసుకుంటే అతడే మొదటి క్రికెటర్.

Scroll to load tweet…

1994 నుంచి 1997 వరకు న్యూజిలాండ్ తరఫున ఆడిన హీత్.. 5 టెస్టులు, 11 వన్డేలలో కివీస్ కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టులలో 17, వన్డేలలో 11 వికెట్లు పడగొట్టాడు. కానీ గాయాలు, నిలకడలేమి కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత దేశవాళీకే పరిమితమయ్యాడు.