క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే దేశంలో కోవిడ్ 19 కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కలిగిస్తోంది.

లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తీరిక లేకుండా గడిపే వీరంతా లాక్‌డౌన్ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు. అదే సమయంలో కరోనాపై అవగాహన కల్పించడంతో పాటు పాత జ్ఞాపకాల్ని షేర్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు, ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ఐపీఎల్‌తో మధుర జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్నాడు. ‘‘మై ఐపీఎల్ మూమెంట్’’ హ్యాష్ ట్యాగ్‌తో సురేశ్ రైనాకు ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన రైనా.. ఐపీఎల్‌లో వచ్చిన ఇన్నింగ్స్ గురించి చెబుతూ పదేళ్ల నాటి జ్ఞాపకాన్ని నెమరవేసుకున్నాడు. విరాల్లోకి వెళితే... 2010లో అప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరుతో ఉన్న జట్టుపై హేడెన్ 93 పరుగులు చేయడాన్ని రైనా తన ఐపీఎల్ ఫేవరెట్ మూమెంట్‌గా పేర్కొన్నాడు.

మ్యాచ్‌లో మంగూస్ బ్యాట్‌ను ఉపయోగించిన హేడెన్ 43 బంతుల్లో 7 సిక్సర్లు, 9 ఫోర్లతో చెలరేగిన విషయాన్ని ప్రస్తావించాడు. ఇది తన ఓవరాల్ ఐపీఎల్‌ ఫేవరెట్ మూమెంట్‌ అని రైనా చెప్పాడు. ఈ మ్యాచ్‌కు సురేశ్ రైనా కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం.. ఈ మ్యాచ్‌లో 49 పరుగులు చేశాడు.

మాథ్యూ హేడెన్‌ ట్వీట్‌పై స్పందించిన రైనా.. ‘‘ ఆ మ్యాచ్‌లో మనం మంచి పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాం.. తాను 49 పరుగులు చేయడమే కాకుండా కెప్టెన్‌గా కూడా ఉన్నా... మనం గెలుస్తామనే నమ్మకాన్ని కల్పించాం హేడెన్. అది నీ బ్యాట్ నుంచి వచ్చిన చిరస్మరణీయమైన ఇన్నింగ్స్... ఆ రోజు మీరు సంతకం చేసి ఇచ్చిన బ్యాట్‌ ఇంకా నాతోనే ఉంది.. ఆ విషయం గుర్తుండే ఉంటుందని అనుకుంటున్నానని రైనా రిప్లయ్ ఇచ్చాడు.