Asianet News TeluguAsianet News Telugu

ఎనిమిదో వింత ఇదే.. జడేజాను రిటైన్ చేసుకోవడంపై సీఎస్కే, జడ్డూ ఆసక్తికర పోస్టులు

IPL 2023: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొంటాడని అంతా అనుకున్నారు. జడేజా, చెన్నై యాజమాన్యం మధ్య  విభేదాలు తారాస్థాయికి చేరాయని వార్తలు వచ్చాయి.  

Everything Is Fine: Ravindra Jadeja Cryptic Tweet After Being Retained By CSK
Author
First Published Nov 16, 2022, 3:51 PM IST | Last Updated Nov 16, 2022, 3:51 PM IST

అపోహలు, అనుమానాలు, విభేదాలు, వివాదాలతో సాగిన  సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది.  టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, అతడు పదేండ్ల నుంచి  ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య   గత  కొన్నాళ్లుగా మంచి సంబంధాలు లేవన్నది బహిరంగ రహస్యమే.  అయినా అటు జడేజా గానీ ఇటు సీఎస్కే గానీ దీనిపై ఏనాడూ  నోరు జారలేదు. గత సీజన్ కు ముందు జడేజాను సారథిగా నియమించడం.. 8 మ్యాచ్ లు కాగానే దానిని  ఊడబీకి తిరిగి ధోనికే అప్పజెప్పడం.. గాయం సాకును  చూపి జడేజాను  జట్టు నుంచి కూడా పంపడం వంటి వివాదాలతో జడేజా-సీఎస్కే యాజమాన్యం మధ్య కావాల్సినంత విభేదాలు వచ్చాయి. 

సీజన్ ముగిసినప్పట్నుంచి చాలాకాలం దాకా జడేజా  యాజమాన్యానికి దూరంగానే ఉన్నాడు. సోషల్ మీడియా ఖాతాలలో చెన్నైకి సంబంధించిన పోస్టులను డిలీట్ చేశాడు. చెన్నై సోషల్ మీడియా ఖాతాలలో కూడా  రవీంద్ర జడేజాను అన్ ఫాలో చేయడం.. జడేజా  కూడా అందుకు తగ్గట్టే వ్యవహరించడంతో  ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని వార్తలు వెలువడ్డాయి.  

దీంతో విసుగొచ్చిన జడేజా.. పదేండ్లుగా సీఎస్కేతో ఉన్న  అనుబంధాన్ని తెంచుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ వేలంలో చెన్నై నుంచి తప్పుకుని వేలంలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అయితే జడేజా-సీఎస్కే మధ్య ధోని మధ్యవర్తిత్వం నడిపాడు. అటు జడేజాను ఇటు సీఎస్కే  యాజమాన్యాన్నీ ఒప్పించి  జడ్డూ చెన్నైతోనే ఉండేట్లు  పావులు కదిపాడు. 

ఇదిలాఉండగా నిన్న (నవంబర్ 15) ఐపీఎల్  రిటెన్షన్ ప్లేయర్ల  జాబితాకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా  చెన్నై విడుదల చేసిన రిటైన్డ్ ప్లేయర్ల లిస్ట్ లో జడేజా పేరు ఉంది. దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.  రిటెన్షన్ లిస్ట్ విడుదలైన కొద్దిసేపటికి జడేజా  తన ట్విటర్ వేదికగా స్పందించాడు.   ఓమ్యాచ్ లో ధోనికి  నమస్కరిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘అంతా బాగానే ఉంది.. రీస్టార్ట్’ అని రాసుకొచ్చాడు.  

 

జడేజా విభేదాలను పక్కనబెట్టి చెన్నైతో కలిసి నడిచినందుకు గాను  సీఎస్కే కూడా ట్విటర్ లో ఆసక్తికర పోస్టును ఉంచింది.  జడేజా విజిల్ వేస్తున్న ఫోటోను షేర్ చేసి.. ‘మాతో కలిసి ఉండటం నిజంగా ఎనిమిదో వింతే..’అనిట్వీట్ చేసింది. ఈ రెండు పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.  

 

చెన్నె సూపర్ కింగ్స్ రిటెన్షన్ లిస్ట్:  ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, శివవ్ ధూబే, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముఖేశ్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్,  శుబ్రాన్షు  సేనాపతి,  రాజ్యవర్ధన్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్పాండే, మతీషా పతిరన, సిమర్జీత్ సింగ్,  ప్రశాంత్ సోలంకి,  మహేశ్ తీక్షణ, అంబటి రాయుడు 

వేలానికి వదిలేసింది:  డ్వేన్ బ్రావో, రాబిన్ ఊతప్ప, ఆడమ్ మిల్నే,  హరి నిశాంత్, క్రిస్   జోర్డాన్, భగత్ వర్మ, కెఎల్  ఆసిఫ్, నారాయణ్ జగదీశన్  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios