Asianet News TeluguAsianet News Telugu

బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి వంద కొట్టాలనేవాళ్లు.. ఆ అంచనాలతో ఇబ్బంది పడ్డా : విరాట్ కోహ్లీ

INDvsAUS: సుమారు నాలుగేండ్ల తర్వాత టెస్టు క్రికెట్ లో మూడంకెల స్కోరును అందుకున్నాడు  రన్ మిషీన్ విరాట్ కోహ్లీ. అహ్మదాబాద్ టెస్టులో  కోహ్లీ సెంచరీ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 
 

Every Time I Step Out, People Want To See A Hundred: Virat Kohli Comments on  Fans Expectations To Score Hundred MSV
Author
First Published Mar 14, 2023, 4:58 PM IST

టెస్టు క్రికెట్ లో సుమారు నాలుగేండ్ల తర్వాత   విరాట్ కోహ్లీ తిరిగి సెంచరీల బాట పట్టాడు. 2019లో బంగ్లాదేశ్ తో ఈడెన్ గార్డెన్ వేదికగా  జరిగిన మ్యాచ్ లో  సెంచరీ తర్వాత అతడు  పేలవ ప్రదర్శనలతో తీవ్ర విమర్శలను ఎదుర్కున్నాడు. ఒకానొక సమయంలో అయితే  కోహ్లీని టీమ్ నుంచి తొలగించడమే మంచిది  అనే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.   ఇక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తొలి మూడు టెస్టులలో విఫలమైన కోహ్లీ.. ఎట్టకేలకు  అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ (186) చేశాడు.  

కాగా అహ్మదాబాద్ లో సెంచరీ  చేసిన తర్వాత  కోహ్లీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో  మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎప్పుడు క్రీజులోకి వచ్చినా అందరూ తాను   సెంచరీ కొట్టాలని ఆశిస్తారని,  ఆ అంచనాలతో తాను చాలా ఇబ్బందిపడ్డానని  చెప్పుకొచ్చాడు. 

కోహ్లీ మాట్లాడుతూ.. ‘అంచనాల బరువును మోయడం నిజంగా  కఠినంగా అనిపించింది.  వాస్తవంగా చెప్పాలంటే నా లోపాల కారణంగా  నాపై నేను కొంచెం సంక్లిష్టతలను పెంచుకున్నా.  ప్రతీసారి మూడంకెల స్కోరు కోసమే  ఆడలేం.    జట్టుకు అవసరమయ్యే విధంగా  40-45 పరుగులు చేసినా నాకు సంతోషమే. కోహ్లీ   40 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుంటే అందరూ సెంచరీ గురించే ఆలోచిస్తారు.   నేను సెంచరీ మాత్రమే కాదు.. అంతకంటే భారీ స్కోరు చేయగలనని కూడా నాకు తెలుసు.  ఏకధాటిగా ఐదారు సెషన్ల పాటు కూడా బ్యాటింగ్ చేయగలను.. 

 

కానీ ప్రతీసారి  సెంచరీ చేయడం ఏ బ్యాటర్ కూ సాధ్యం కాదు. కొన్నికొన్నా సార్లు అది కష్టం కూడా.  నేను హోటల్ గది నుంచి బయటకు వచ్చినప్పట్నుంచి బస్ డ్రైవర్, లిఫ్ట్ లో ఉన్న వ్యక్తి.. ఇలా ప్రతీ ఒక్కరూ  మాకు హండ్రెడ్ కావాలి అంటారు. బ్యాటింగ్ కు వెళ్లిన ప్రతీసారి ఇది మనసులో మెదులుతూనే ఉంటుంది. అయితే ఈ  సవాళ్లను  ఎదుర్కుంటూ  చాలాకాలం పాటు ఆటలో కొనసాగడమే అందం..’అని చెప్పుకొచ్చాడు.  

కాగా రాహుల్ ద్రావిడ్ కూడా  కోహ్లీ సెంచరీపై ప్రశంసలు కురిపించాడు. తాను హెడ్ కోచ్ గా నియమితుడయ్యాక కోహ్లీ టెస్టులలో తొలి సెంచరీ చేశాడని, అది చూడటం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు.  కోహ్లీ ఇన్నింగ్స్ ను నడిపించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios