INDvsAUS: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జూన్ లో జరగాల్సి ఉన్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ కోసం ఇరు జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఏడాది జూన్ 7న జరుగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు ఇండియా-ఆస్ట్రేలియా అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఓవల్ వేదికగా జరిగే ఈ టెస్టులో గెలిచి పదేండ్ల ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చాలని భారత్ భావిస్తుండగా గత కొంతకాలంగా మసకబారుతున్న తమ ప్రభను తిరిగి తెచ్చుకుని మరోసారి అగ్రశ్రేణి జట్టు హోదాను నిలబెట్టుకునేందుకు ఆసీస్ తంటాలు పడుతున్నది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అయితే ఇంగ్లాండ్ లో టెస్టు జరుగుతున్నందున స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లయితే జట్టుకు ఉపయుక్తకరమని.. ఆ స్థానాన్ని హార్ధిక్ పాండ్యా అయితే భర్తీ చేస్తాడని బీసీసీఐ, సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఇదే విషయాన్ని హార్ధిక్ తో చర్చించినా అతడు మాత్రం అందుకు సుముఖంగా లేడు.
తాజాగా ఆస్ట్రేలియాతో నేడు వాంఖెడే వేదికగా జరుగబోయే తొలి వన్డేకు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో హార్ధిక్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. తాను నైతికంగా చాలా బలమైన వ్యక్తినని, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు తాను ఒక్క శాతం కూడా కృషి చేయలేదని, ఫైనల్ ఆడటం సమంజసం కాదని చెప్పాడు.
అది సమంజసం కాదు..
డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆడతారా అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ... ‘లేదు. నేను నైతికంగా చాలా బలమైన వ్యక్తిని. నేను అక్కడికి చేరుకోవడానికి 10 శాతం పని చేయలేదు. వాస్తవంగా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు నేను ఒక్క శాతం కూడా కృషి చేయలేదు. కావును నేను ఇప్పుడు వెళ్లి మరొకరి స్థానాన్ని భర్తీ చేయడం నైతికంగా సరికాదు. నేను టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటే నన్ను నేను అందుకు మానసికంగా సిద్ధం చేసుకుని స్థానం సంపాదించుకుని ఆడతాను. నేను డబ్ల్యూటీసీ ఫైనల్ కు అందుబాటులో ఉండను.. నన్ను నేను నిరూపించుకునేదాకా భవిష్యత్ లో కూడా టెస్టులు ఆడను..’అని స్పష్టం చేశాడు.
ఉపఖండపు పిచ్ లపై స్పిన్నర్లు ప్రభావం చూపిస్తే ఇంగ్లాండ్ లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అక్కడ పిచ్ లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. భారత్ లో అంటే ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతో ఆడినా సరిపోతుంది గానీ ఇంగ్లాండ్ లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు ఎంత ఎక్కువగా ఉంటే ఆ జట్టుకు విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మరి హార్ధిక్ తాను డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడని తేల్చిన నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది. బుమ్రా, పంత్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో ఈ టెస్టులో గెలవడం భారత్ కు అతిపెద్ద సవాలే.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ ను 2-1 తేడాతో ఓడించిన భారత్ ఇక నేటి నుంచి వన్డే సిరీస్ లో ఆసీస్ పని పట్టేందుకు సిద్ధమవుతున్నది. తొలి వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో హార్ధిక్ పాండ్యానే సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు. వన్డేలలో కెప్టెన్ గా ఉండటం అతడికి ఇదే తొలిసారి. మరి వాంఖెడేలో పాండ్యా అండ్ గ్యాంగ్.. ఆసీస్ ను ఎలా నిలువరిస్తుందో చూడాలి.
