England World Record Score in ODIs: సాధారణంగా ఒక బ్యాటర్ ఎంత దూరం సిక్సర్ కొడతాడు..? 80 మీటర్లు.. 90 మీటర్లు.. పోనీ 110 మీటర్లు అనుకుందాం.. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ మాత్రం అంతకుమించి...!!

చిన్నప్పుడు ఊళ్లల్లో గల్లీ క్రికెట్ ఆడిన ఆట గుర్తుందా.. అప్పట్లో పెద్ద గ్రౌండ్స్ గానీ ఇతరత్రా ఏ సౌకర్యాలు గానీ లేని రోజుల్లో ఏదో ఖాళీ స్థలం కనిపించినా అక్కడ వికెట్లు పాతేయడమే. ఈ క్రమంలో ఎవరైనా అత్యుత్సాహంతో సిక్సర్ కొడితే అది కాస్తా వెళ్లి పక్కనే ఉన్న పొలంలోనో, మక్క చేనులోనో, పత్తి చేనులోనే లేక అక్కడ కాస్త చెట్లు ఎక్కువగా ఉంటే తుప్పల్లోనో పడితే నానా కష్టపడి వెతుక్కుని తేవాల్సిందే. ఆ రోజులే వేరు. శుక్రవారం నెదర్లాండ్స్ ఆటగాళ్లదీ అదే పరిస్థితి. ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ కొట్టిన బంతి వెళ్లి గ్రౌండ్ ను ఆనుకుని ఉన్న తుప్పల్లో పడింది. 

ఇంగ్లాండ్-నెదర్లాండ్స్ మధ్య అమ్స్టేల్విన్ లోని వీఆర్ఎ క్రికెట్ గ్రౌండ్ వేదికగా శుక్రవారం తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా.. వన్ డౌన్ లో వచ్చిన డేవిడ్ మలన్ ధాటికి నెదర్లాండ్స్ ఆటగాళ్లు తుప్పల్లోకి వెళ్లి బంతిని తీసుకురావాల్సిన పరిస్థితి ఎదురైంది. 

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ 9వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో మలన్.. బ్యాట్ కు అనుకూలంగా వచ్చిన బంతిని తన బలాన్నంతా ఉపయోగించి బాదాడు. దీంతో ఆ బంతి కాస్తా స్టేడియంను ఆనుకుని ఉన్న పెద్ద పెద్ద చెట్లు, దాని కింద ఉన్న తుప్పల్లో పడింది. 

దీంతో గ్రౌండ్ సిబ్బందితో పాటు నెదర్లాండ్స్ ఆడగాళ్లు కూడా తుప్పల్లోకి వెళ్లి బంతి ఎక్కడ పడిందని వెతుక్కున్నారు. కొద్దిసేపు వెతకడంతో బంతి దొరకడంతో అక్కడ ఉన్నవాళ్లంతా జరుగుతున్న తంతు చూసి కాసేపు నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

Scroll to load tweet…

ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్... నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ (122), డేవిడ్ మలన్ (125), జోస్ బట్లర్ (162 నాటౌట్) లు సెంచరీలతో చెలరేగారు. వీరికి తోడు లియామ్ లివింగ్ స్టోన్ (66) దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. అనంతరం నెదర్లాండ్.. 49.4 ఓవర్లలో 266 పరుగులకే ఆలౌట్ అయింది. వన్డేలలో ఇది (498) అత్యధిక స్కోరు కావడం విశేషం. 

వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోర్లు : 

- ఇంగ్లాండ్: 498-4 (నెదర్లాండ్స్-2022) 
- ఇంగ్లాండ్: 481-6 (ఆస్ట్రేలియా-2018) 
- ఇంగ్లాండ్: 444-3 (పాకిస్తాన్ - 2016)
- శ్రీలంక: 443-9 (నెదర్లాండ్స్ - 2006) 
- సౌతాఫ్రికా: 439-2 (వెస్టిండీస్ - 2015)
- సౌతాఫ్రికా: 438-9 (ఆస్ట్రేలియా-2006) 

Scroll to load tweet…