Asianet News TeluguAsianet News Telugu

రికార్డుల బూజు దులిపిన రావల్పిండి టెస్టు.. ఒక్క టెస్టులో ఇన్ని పరుగులా...!

PAKvsENG: పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మధ్య రావల్పిండి వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లీష్ జట్టు సంచలన విజయాన్ని అందుకుంది.  డ్రా తప్పదనుకున్న మ్యాచ్ లో ఫలితాన్ని రాబట్టి ఔరా! అనిపించింది.. 

England vs Pakistan Rawalpindi Test Sets World Record, Batters Scores 1768 Runs
Author
First Published Dec 5, 2022, 6:55 PM IST

17 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ లో టెస్టులు ఆడేందుకు వచ్చిన  ఇంగ్లాండ్ తమ పర్యటనను ఘనంగా ఆరంభించింది. రావల్పిండి వేదికగా  సోమవారం ముగిసిన టెస్టులో అసలు ఫలితం తేలుతుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ  ఏకంగా విక్టరీతో పాకిస్తాన్ తో పాటు ప్రపంచ క్రికెట్‌నూ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆట చివరిరోజు ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో  పలు పాత రికార్డులు బద్దలయ్యాయి.  ఒక టెస్టులో అత్యధిక  పరుగులు నమోదవడం  పాకిస్తాన్‌లో ఇదే ప్రథమం. ఇరు జట్ల బ్యాటర్లు ఈ మ్యాచ్ లో సెంచరీల మోత మోగించారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు నలుగురు సెంచరీలు చేయగా..  పాక్ నుంచి ముగ్గురు  శతకాలు  సాధించారు. 

ఐదు రోజుల టెస్టులు ప్రారంభమయ్యాక  ఒక టెస్టు మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన తొలి జట్టుగా  ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల బ్యాటర్లు పండుగ చేసుకున్న ఈ మ్యాచ్ లో  మొత్తంగా నాలుగు ఇన్నింగ్స్ లలో కలిపి  1,768  పరుగులు నమోదయ్యాయి.  ఇది  ప్రపంచ రికార్డు.  

టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు నమోదైన  సందర్భాలు రెండు ఉన్నాయి.   1939లో కింగ్స్‌మీడ్ మైదానం వేదికగా ఇంగ్లాండ్ - సౌతాఫ్రికా మధ్య  జరిగిన మ్యాచ్ లో 1981 పరుగులు నమోదయ్యాయి.  సౌతాఫ్రికా రెండు ఇన్నింగ్స్ లలో 530, 481 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 316, 654 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బౌలర్లు 35 వికెట్లు తీసినా మ్యాచ్ డ్రా గా ముగిసింది. 

ఇంగ్లాండ్, సఫారీల మ్యాచ్ కంటే ముందే..  1930లో సబీనా పార్క్ వేదికగా ఇంగ్లాండ్ - వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా 1,815 పరుగులు నమోదయ్యాయి.   ఈ  టెస్టులో వెస్టిండీస్.. 286, 408 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ 849, 272 పరుగులు చేసింది. బౌలర్లు 34 వికెట్లు పడగొట్టారు. అయినా  మ్యాచ్ డ్రా గానే ముగిసింది. అయితే  ఇంగ్లాండ్ - సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ - వెస్టిండీస్ మ్యాచ్ లు  9 రోజులు ఆడారు.  కానీ పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మధ్య రావల్పిండి టెస్టు 5 రోజుల్లోనే ముగిసింది. 1,768 పరుగులు నమోదైన ఈ మ్యాచ్ లో బౌలర్లు కూడా 37 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో ఫలితం తేలింది. 

ఇక పాకిస్తాన్ లో అత్యధిక పరుగులు నమోదైన టెస్టు గా గతంలో ఉన్న భారత్-పాక్ మ్యాచ్ రికార్డును తాజా మ్యాచ్ బ్రేక్ చేసింది. 2006లో ఫైసలాబాద్ లో భారత్ - పాక్ కలిసి 1,702 పరుగులు నమోదు చేశాయి. 

 

- ఒక టెస్టు మ్యాచ్ లో తొలి రోజే 500  ప్లస్ (506) పరుగులు చేయడం ఇదే ప్రథమం. గతంలో ఆసీస్.. తొలి రోజు 494 రన్స్ (సౌతాఫ్రికాపై) సాధించింది. 
- ఒక టెస్టులో రెండు జట్ల ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇదే ప్రథమం. ఈ మ్యాచ్ లో జాక్ క్రాలే, బెన్ డకెట్ ఇంగ్లాండ్ తరఫున సెంచరీలు చేయగా పాక్ బ్యాటర్లు షఫీక్, ఇమామ్ ఉల్ హక్ లు  కూడా  సెంచరీలు చేశారు. 

 

సంక్షిప్త స్కోరు వివరాలు : 

ఇంగ్లాండ్ : తొలి ఇన్నింగ్స్ లో 657 ఆలౌట్ 
పాకిస్తాన్ : తొలి ఇన్నింగ్స్ లో  579 ఆలౌట్ 
ఇంగ్లాండ్ : రెండో ఇన్నింగ్స్ లో 264 -7 డిక్లేర్డ్ (పాక్ ఎదుట 343 పరుగుల లక్ష్యం)  
పాకిస్తాన్ :  రెండో ఇన్నింగ్స్ లో 268 ఆలౌట్ 
ఫలితం :  74 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం 

Follow Us:
Download App:
  • android
  • ios