యాషెస్ సీరిస్ 2019లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు మొదటి విజయాన్ని అందుకుంది. లీడ్స్ వేదికన జరిగిన మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియాపై అన్ని విభాగాల్లో ఇంగ్లీష్ జట్టు ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే చివర్లో ఓటమివైపు సాగుతున్న ఆ జట్టు ప్రయాణాన్ని అద్భుత శతకం(135 పరుగులు)తో బెన్ స్టోక్స్ మలుపుతిప్పాడు. అతడి సూపర్ ఇన్నింగ్స్ మూలంగానే ఇంగ్లాండ్ విజయాన్ని అందకుందనడంలో అతిశయోక్తి లేదు. ఇలా సొంతగడ్డపై చెలరేగి అద్భుత విజయాన్ని అందించిన అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

అభిమానులతో పాటు వివిధ రంగాల ప్రముఖలు, మాజీ క్రికెటలర్లు స్టోక్స్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అతడిని పొగడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇలా ఇగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ కూడా స్టోక్స్ పై ప్రశంసించాడు. అయితే అందరిమాదిరిగా కాకుండా స్టోక్స్ కు ఓ బంపరాఫర్ ఇవ్వాలనున్నా తనకు ఆ అవకాశం లేదంటూ స్వాన్ ట్విట్టర్ ద్వారా ఫన్నీ కామెంట్ చేశాడు. 

''నాకు అక్కాచెల్లుల్లు లేరు. ఒకవేళ వుండివుంటే బెన్ స్టోక్స్ తో ఆమె పెళ్లి  చేసేవాడిని.'' అంటూ స్వాన్ ట్వీట్ చేశాడు. స్టోక్స్ ఆటతీరు నన్ను అంతలా ఆకట్టుకుంది అని చెప్పడానికి స్వాన్ ఈ కామెంట్ చేశాడు. అతడిపై వున్న ఇష్టంతోనే తన చెల్లినిచ్చి బావగా మార్చుకోవాలని ఆశపడినట్లు స్వాన్ తెలిపాడు. 

యాషెస్ సీరిస్ ఆరంభ మ్యాచ్ లో ఆసిస్ ఆటగాడు స్మిత్ దెబ్బకు ఇంగ్లాండ్ ఓటమిపాలయ్యింది. అయితే తాజాగా స్టోక్స్ వీరోచిత పోరాటానికి ఆసిస్ తలవంచాల్సి వచ్చింది. ఇలా ఐదు వన్డేల ఈ సీరిస్ లో ఇప్పటివరకు మూడు మ్యాచులు జరగ్గా ఇరుజట్లు 1-1తో సమానంగా నిలిచాయి. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మూడో టెస్ట్ లో ఆసిస్ నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ చివరివరకు పోరాడి ఛేదించింది. చివరి వికెట్ కు ఏకంగా 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరీ స్టోక్స్ తమ జట్టును గెలిపించుకున్నాడు. అతడు పట్టువదలని  విక్రమార్కుడిలా  క్రీజులో పాతుకుపోవడంతో ఆసిస్ బౌలర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో చివరి వికెట్ సాయంతో ఇంగ్లాండ్ ను విజయతీరాలను చేర్చి స్టోక్స్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.